
నిజామాబాద్, వెలుగు : కేసీఆర్ పాలనలో కొత్త రేషన్ కార్డుల ఊసే లేదని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్అలీ విమర్శించారు. సోమవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయన్నారు. 13 ఏండ్ల నిరీక్షణ తర్వాత మంజూరైన 11,852 కొత్త కార్డులతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 84,232 మందిని కార్డుల్లో చేర్చామన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేయడానికి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
అప్పులు భరిస్తూ పథకాల అమలు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.7.80 లక్షల కోట్ల భారాన్ని మోస్తూ కాంగ్రెస్ సర్కార్ సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తోందని షబ్బీర్అలీ అన్నారు. మహిళలకు ఫ్రీ జర్నీ, పంట రుణమాఫీ, రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఈ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.
స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు తాహెర్, మానాల మోహన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీఎస్వో అరవింద్‌రెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు. అంతకు ముందు మొక్కలు నాటారు. అనంతరం పలు ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకరణకు హాజరయ్యారు.