తెలంగాణలో పారిశ్రామిక విధానాలు

తెలంగాణలో పారిశ్రామిక విధానాలు

పెట్టుబడిదారి విధాన దేశాలను 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం కుదిపేసింది. తప్పని పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రభుత్వ జోక్యం తప్పని సరైంది. అప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు అడుగులు పడ్డాయి. భారతదేశం కూడా ఇదే ఆర్థిక వ్యవస్థను అనుసరించింది. అనుసరిస్తోంది. ఈ వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేట్​ వ్యవస్థలు కలసి ఉంటాయి. కొన్ని పరిశ్రమలను ప్రభుత్వరంగానికి రిజర్వ్ చేస్తారు. మిగతా వాటిని ప్రైవేట్​ రంగానికి కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో భారతదేశం పలు పారిశ్రామిక తీర్మానాలను ఆమోదించింది. ​ 

భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్​ రంగాలు కలిసి ఉండటమే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఈ రెండు రంగాల పరిధిని తెలిపేందుకు ప్రభుత్వం పారిశ్రామిక విధానాలను ప్రకటిస్తుంది. తొలి పారిశ్రామిక తీర్మానాన్ని 1948, ఏప్రిల్​ 6న అప్పటి పరిశ్రమల మంత్రి శ్యాంప్రసాద్​ ముఖర్జీ ప్రకటించారు. ఈ తీర్మానం ప్రభుత్వ, ప్రైవేట్​ రంగాల సహకారంతో పారిశ్రామిక ప్రగతి జరగాలని ఆశించింది. ఇందులో పరిశ్రమలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. ప్రభుత్వ ఏకస్వామ్యాలు: దేశ రక్షణ, తత్సంబంధ పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఉదా: ఆయుధాలు – ఆయుధ సామగ్రి, అణుశక్తి, రైల్వేలు. 

మిశ్రమ రంగంలోని పరిశ్రమలు: టెలిఫోన్​, టెలీగ్రాఫ్​– వైర్​లెస్​, ఇనుము– ఉక్కు, బొగ్గు, విమానాల ఉత్పత్తి, నౌకా నిర్మాణం, మినరల్​ ఆయిల్స్​, వీటిని 10 సంవత్సరాల వరకు ప్రైవేట్​ వ్యక్తులే నిర్వహిస్తారు. ఆ తర్వాత జాతీయం చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. వీటిలో కొత్త పరిశ్రమలు ప్రభుత్వమే స్థాపిస్తుంది. 

ప్రభుత్వరంగ అజమాయిషీలోని పరిశ్రమలు: భారీ రసాయనాలు, భారీ యంత్రాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, పంచదార, సిమెంట్​, కాగితం, ఆటోమొబైల్స్​ మొదలైన 18 పరిశ్రమల్లో ప్రైవేట్​ రంగాన్ని అనుమతించినా ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. 

ఇతర పరిశ్రమలు: ఇవి ప్రైవేట్​రంగంలో ఉంటాయి. 

1956 పారిశ్రామిక తీర్మానం 

భారీ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తూ రెండో ప్రణాళికకు సిద్ధమవడం, ప్రభుత్వం సామ్యవాదరీతి సమాజం వైపు అడుగులు వేయడం, రాజ్యాంగ రచన పూర్తయి ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యమివ్వడం వల్ల రెండేండ్ల ముందుగానే పారిశ్రామిక తీర్మానం 1956ను ప్రకటించాల్సి వచ్చింది. వృద్ధిరేటును, పారిశ్రామికీకరణను సత్వరం చేయడం, ప్రభుత్వరంగాన్ని విస్తరించడం, భారీ తయారీ పరిశ్రమల అభివృద్ధి, ఆదాయ, సంపద అసమానతలు తగ్గించడం లక్ష్యంతో 1956 తీర్మానం ప్రకటించారు. ఇందులో పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించారు. 

జాబితా ఎ: ఇందులో 17 పరిశ్రమలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ఉదా: ఆయుధాలు, ఆయుధ సామగ్రి, రక్షణ పరికరాలు, రైల్వేలు, తంతి తపాలా, టెలిఫోన్, టెలీగ్రాఫ్, విమానయానం, నౌకాయానం, ఇనుము – ఉక్కు, బొగ్గు, అణుశక్తి

జాబితా బి: 12 పరిశ్రమలు ఉన్నాయి. ఇది మిశ్రమ రంగం. ఉదా: అల్యూమినియం, రసాయన పరిశ్రమలు, ఆంటీబయాటిక్స్​, ఎరువులు, రోడ్లు, సముద్ర రవాణా

జాబితా సి: పై రెండు జాబితాల్లో లేని అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రైవేట్​ రంగానికి విడిచిపెట్టారు. 

1969 పారిశ్రామిక విధాన ప్రకటన

పారిశ్రామిక లైసెన్సింగ్​ విధానంలోని లోపాలను పరిష్కరించే లక్ష్యంతో దీనిని ప్రకటించి 1969లో ఎంఆర్​టీపీ యాక్ట్​ను ప్రవేశ పెట్టారు. కొద్ది మంది చేతుల్లో ఆర్థిక శక్తి కేంద్రీకృతం కాకూడదనే దత్​ కమిటీ సిఫార్సులపై దీనిని ప్రవేశ పెట్టారు. 

1973 పారిశ్రామిక తీర్మానం

దత్​ కమిటీ సిఫార్సులపై జాయింట్​ సెక్టార్​కు ప్రాధాన్యత ఇచ్చారు. ఫెరా యాక్ట్​ను తీసుకువచ్చారు.

1977 పారిశ్రామిక తీర్మానం

ఆనాటి పరిశ్రమల మంత్రి జార్జి ఫెర్నాండెజ్​ 1977, డిసెంబర్ లో ఈ తీర్మానం ప్రకటించారు. కాంగ్రెస్​ విధానాల వల్ల పేదరికం, నిరుద్యోగిత పెరిగాయని భావించి ఇందులో చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. 

సూక్ష్మ పరిశ్రమలు: 50,000 జనాభా కంటే తక్కువ జనాభా గల పట్టణాల్లో రూ.లక్ష పెట్టుబడి పరిమితి గల పరిశ్రమలను సూక్ష పరిశ్రమలు అంటారు.చిన్న పరిశ్రమలకు పెట్టుబడి పరిమితిని రూ. 10లక్షలకు, అనుబంధ పరిశ్రమల పెట్టుబడిని రూ.15లక్షలకు పెంచారు. 

రిజర్వేషన్: చిన్న పరిశ్రమలకు కేటాయించిన జాబితాను 180 నుంచి 807కు పెంచారు. ఈ తీర్మానం చిన్న పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 

డిస్ట్రిక్​ ఇండస్ట్రియల్​ సెంటర్స్​: చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు ఒకేచోట ఇచ్చేందుకు జిల్లా పారిశ్రమిక కేంద్రాలు స్థాపించాలని తీర్మానించారు. 

పెద్ద పరిశ్రమలు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమయ్యే రంగాల్లోకి, చిన్న పరిశ్రమలకు రిజర్వు చేయబడని రంగాల్లోకి పెద్ద తరహా పరిశ్రమల యాజమానులు ప్రవేశించవచ్చు.

1991 నూతన పారిశ్రామిక తీర్మానం

ఆనాటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్​సింగ్​ల ఆధ్వర్యంలో నూతన పారిశ్రామిక తీర్మానాన్ని 1991 జులైలో భారీ పరిశ్రమలకు, ఆగస్టులో చిన్న పరిశ్రమలకు సంబంధించి ప్రకటించారు. భారత ఆర్థిక చరిత్రలో ఇదో మైలురాయి. లైసెన్సింగ్​ విధానం రద్దు చేశారు. ప్రభుత్వరంగానికి రిజర్వు చేసిన పరిశ్రమలను 17 నుంచి 8కి తగ్గించారు. ఈ తీర్మానంలో ప్రభుత్వరంగం.. ప్రైవేట్​ రంగం ప్రవేశించని సాంఘిక సేవలు, అవస్థాపనా సదుపాయాల్లోకి ప్రవేశించి పెట్టుబడి పెట్టాలని భావించారు. ప్రభుత్వ రంగంలో వనరులను పెంచుకోవడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వరంగ సంస్థల వాటాలను మ్యూచువల్​ ఫండ్స్​కు, విత్త సంస్థలకు, కార్మికులకు, ప్రజలకు విక్రయిస్తారు. అంటే పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం ప్రారంభమైంది.

1980 పారిశ్రామిక తీర్మానం

1956 పారిశ్రామిక తీర్మానానికి లోబడి దీన్ని ప్రకటించారు. ఆర్థిక ఫెడరలిజం, న్యూక్లియర్​ ప్లాంట్​ తదితర భావనలను ప్రవేశపెట్టారు. సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడి 1 నుంచి 2 లక్షలకు, చిన్న పరిశ్రమల పెట్టుబడిని 10 నుంచి 20 లక్షలకు, అనుబంధ పరిశ్రమల పెట్టుబడిని 15 నుంచి 25 లక్షల రూపాయలకు పెంచారు. 

1985 పారిశ్రామిక తీర్మానం

ఎంఆర్​టీపీ చట్ట పరిధిలోని ఆస్తుల పరిధిని 20 నుంచి 100 కోట్లకు పెంచారు. తొలిసారిగా బ్రాడ్​ బ్యాండ్​ సదుపాయం కల్పించారు. రాజీవ్​గాంధీ హయాంలో దిగుమతులను సరళీకరించారు. 

1990 పారిశ్రామిక తీర్మానం

ఆనాటి వాణిజ్య మంత్రి అజిత్​సింగ్​ ఈ పారిశ్రామిక తీర్మానం ప్రకటించారు. ఇది 1977 జనతా ప్రభుత్వ తీర్మానాన్ని పోలి ఉంది. 1990లో ఎస్​ఐడీబీఐ ఏర్పాటు చేశారు.