వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్య సంరక్షణ చర్యలు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు  మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ లకు బాధ్యతలు అప్పగించింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కే రమేష్ రెడ్డి నోడల్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల బాధ్యతలను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ జి. శ్రీనివాసరావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిరువురూ తక్షణం ఆయా జిల్లాలకు చేరుకొని, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఆరోగ్య సంరక్షణ చర్యలు పర్యవేక్షించాలని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అన్ని ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలని సూచించింది. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించింది.