ఉపాధి హామీ జాబ్ కార్డుల జారీలో సర్కారు మార్పులు

ఉపాధి హామీ జాబ్ కార్డుల జారీలో సర్కారు మార్పులు
  • ఇంట్లో ఇద్దరికి మించి కూలీలుంటే అడిషనల్‌ కార్డులు
  •  100 రోజులకు మించి పని కల్పించేందుకు..
  •  ముందు 1.69 లక్షల కుటుంబాలకు అందజేత

ఒక ఫ్యామిలీకి ఒకే జాబ్ కార్డు విధానంలో రాష్ట్ర సర్కారు మార్పులు చేసింది. ఒక ఫ్యామిలీలో ఇద్దరికి మించి ఉపాధి కూలీలుంటే వారికి వేర్వేరుగా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వేరే పనులేవీ దొరక్క ఎక్కువగా ఉపాధి హామీ కూలీకి వెళ్లే వాళ్లు పనికి దూరం కావొద్దన్న ఉద్దేశంతో ఈ మార్పు చేసింది. తొలుత ఈ రెండున్నర నెలల్లోనే 75 శాతం పని దినాలు పూర్తి చేసిన 1.69 లక్షల కుటుంబాలకు అదనపు కార్డులు ఇవ్వనుంది.

100 రోజులు పూర్తయితే అంతే..

ఉపాధి హామీ పథకంలో ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డే ఇవ్వాలని రూల్‌ ఉంది. ఆ జాబ్ కార్డుపై కుటుంబీకులందరికీ కలిపి వంద రోజుల పని కల్పించాలి. అంటే కుటుంబంలో ముగ్గురుంటే ఏడాదికి ఒక్కొక్కరికి సగటున 33 రోజుల పనే దొరికేది. ఏడాదిలో 100 పనిదినాలు పూర్తయితే అదనపు పని దినాలు కల్పించడం కుదరదు. దీంతో వాస్తవంగా పని అవసరమైన కుటుంబాలకు 100 రోజుల తర్వాత పని దొరకని పరిస్థితి. అందుకే అదనపు కార్డుల విధానాన్ని సర్కారు తీసుకొచ్చింది.

14.09 లక్షల కుటుంబాల్లో ఇద్దరికి మించి

రాష్ట్రంలో 52,42,769 కుటుంబాలకు ఈజీఎస్ జాబ్ కార్డులుండగా ఇందులో 14.09 లక్షల కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు, నలుగురు కూలీల చొప్పున ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించింది. ఇందులో 1,69,679 కుటుంబాలు గత రెండున్నర నెలల్లో 75 పని దినాలు పూర్తి చేసుకున్నాయి. ఇందులో కామారెడ్డి జిల్లాలో ఎక్కువగా 29,182 కుటుంబాలు, వికారాబాద్ లో 12,670, నల్గొండలో 9,599, కొత్తగూడెంలో 8,712 కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాలకు మరో 25 పని దినాలు కల్పిస్తే ఇక పని కల్పించడం కుదరదు. అందుకే 1.69 లక్షల కుటుంబాలకు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి అదనంగా జాబ్ కార్డులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కుటుంబాలకు మరిన్ని రోజులు పని పొందే అవకాశం కలగనుందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.