ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
  • రిటర్నింగ్ అధికారిగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్  సునీతా గోపాల్‌దాస్ నియామకం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిటర్నింగ్ అధికారిగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్‌దాస్‌ను నియమించింది. గోపాల్‌ దాస్‌ ప్రస్తుతం ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్నారు. తర్వాత నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ వంటి ఏర్పాట్లపై ఫోకస్ చేయనున్నారు. 

ఏర్పాట్లన్నీ పూర్తయితే ఆగస్టులో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. 2016 జూలై 19 న ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగ్గా.. మళ్లీ ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే దీనిపై కార్మిక సంఘాలు మాత్రం నోరు మెదపడం లేదు. సమ్మె విరమణ సందర్భంలో ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి. అయితే మొదట విలీనానికే ప్రాధాన్యత ఇచ్చామని, సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలత వ్యక్తం చేశారని, ఇప్పుడు మాత్రం ముందుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుందని కొందరు నాయకులు అంటున్నారు. 

ఇలా చేయడం తమను నిరాశపరిచినట్లేనని వారు వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం మొదటగా గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపించి, ఇందులో గెలిచిన సంఘాన్ని విలీన ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో ఉంది. రానున్న రోజుల్లో యూనియన్లు ఎన్నికలపై దృష్టిపెట్టాల్సిన అనివార్య పరిస్థితులను ప్రభుత్వం కల్పించింది. ఇప్పటివరకు విలీనం కోసం పట్టుపట్టిన కార్మిక సంఘాలు, ఇకనుంచి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలను ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్టీసీలో మొదట డిపో కార్యదర్శి, ఆ తర్వాత రీజినల్ కార్యదర్శి, చివరగా రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక నిర్వహించనున్నారు. దాంతో ఇప్పుడు డిపోల స్థాయిలో ఎన్నికల కోలాహలం మొదలుకానుంది.