ఎన్డీఎస్ఏ రిపోర్టుపై స్టడీ

ఎన్డీఎస్ఏ రిపోర్టుపై స్టడీ
  • నిర్ణయించిన ప్రభుత్వం.. ఐదుగురు అధికారులకు బాధ్యతలు
  • కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ప్రతిపాదనలు రెడీ చేయాలని ఆదేశాలు
  • సెంట్రల్‌‌ వాటర్‌‌‌‌ కమిషన్‌‌ అభిప్రాయం కూడా తీస్కోవాలని యోచన

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిపోర్టులోని అంశాలన్నింటినీ క్షుణ్ణంగా స్టడీ చేయాలని ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం), రామగుండం సీఈ, సీడీవోసీఈ, క్వాలిటీ కంట్రోల్​ సీఈలను ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఇరిగేషన్​ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులిచ్చారు. రిపోర్టును పరిశీలించి బ్యారేజీల రక్షణ, తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు రెడీ చేయాలని ఆదేశించారు. 

ఆ బ్యారేజీలపై ఆధారపడిన ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈఎన్​సీ జనరల్​ ప్రభుత్వానికి పంపించాలని ఆదేశాలిచ్చారు. బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రిపేర్లకు ఎంత టైం పడ్తుంది? ఎన్డీడీఎస్ఏ సూచించిన టెక్నికల్​ ఎవాల్యుయేషన్‌‌ను ఏ సంస్థలతో చేయించాలి వంటి వాటిపై అధికారులు స్టడీ చేయనున్నట్టు తెలుస్తున్నది. 

రెండ్రోజుల్లో రేవంత్‌‌ రెడ్డి సమీక్ష​..

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఏప్రిల్​ 24న ఎన్డీఎస్ఏ తుది నివేదికను విడుదల చేసింది. మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌‌ను పూర్తిగా తొలగించి కొత్తది నిర్మించాలని సిఫార్సు చేసింది. బ్యారేజీ మొత్తం సమస్యలుండే అవకాశం ఉందని, మరోసారి అన్ని జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే రిపోర్టుపై అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటు బ్యారేజీల రక్షణ, మరమ్మతులకు సంబంధించి సెంట్రల్ వాటర్​ కమిషన్ (సీడబ్ల్యూసీ) అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని యోచిస్తున్నది. 

దీనిపై ఇప్పటికే ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌‌కు విజ్ఞప్తి చేయగా.. ఢిల్లీలో చర్చిద్దామంటూ ఆయన సూచించారు. తాజాగా దీనిపై సీఎం రేవంత్‌‌తో చర్చించి ముందుకు వెళ్లాలని అధికారులు యోచిస్తున్నారు. వాస్తవానికి శుక్రవారమే సీఎంతో మీటింగ్​ జరగాల్సి ఉన్నా.. ఆయన ఢిల్లీలో కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశం ఉండడంతో వాయిదా పడింది. దీంతో మరో రెండ్రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టుపై సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది.