ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఇంకెప్పుడు

ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఇంకెప్పుడు

విశ్లేషణ : తెలంగాణ రాష్ట్రం  ఏర్పడి ఏడేండ్లు గడుస్తున్నా రాష్ట్రంలో 25% శాతం ఉన్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు (ఎస్సీ/ఎస్టీ) రక్షణ, సంక్షేమం, రిజర్వేషన్ చట్టాల అమలులో జరుగుతున్న అన్యాయాలను అధిగమించేందుకు కమిషన్‌‌ను ఆశ్రయించే వర్గాల వారికి పూర్తిస్థాయి కమిషన్ లేకపోవడంతో సరైన న్యాయం జరగడం లేదు. ఎస్సీ, ఎస్టీల వర్గాలకు వెంటనే న్యాయం అందాలనే సదుద్దేశంతో జాతీయ స్థాయిలో ఉమ్మడిగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్​ను 2006లో జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్‌‌ అని రెండుగా విభజించి రెండు వర్గాలకు రాజ్యాంగ బద్ధంగా ఆ కమిషన్ తన సేవలను అందిస్తున్నామని చెబుతోంది. అయితే నిబంధనలకు అనుగుణంగా ఈ సేవలేవీ ఇరు వర్గాల వారికి చేరడం లేదు. అందుకే వీలైయినంత త్వరగా ఈ కమిషన్‌‌ చర్యలు చేపడితే మంచిది

విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఎస్సీ/ఎస్టీ వర్గాల గురించి పూర్తి చిత్తశుద్ధితో ఆ రాష్ట్ర ఎస్సీ/ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నో కేసుల్లో బాధితులకు అండగా నిలుస్తూ 2019లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మెరుగైన సేవలు అందించాలని సదుద్దేశంతో ఎస్టీల గురించి ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్, ఎస్సీల గూర్చి ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ రెండు కమిషన్లకు చైర్మన్లను నియమించి సేవలందిస్తోంది. కానీ పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉన్న ఉమ్మడి ఎస్సీ/ఎస్టీ కమిషన్​కు చైర్మన్, సభ్యులను వేయకుండా ఆ వర్గాలను మోసం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాలకుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎస్సీ/ఎస్టీ అత్యాచార కేసులలో దేశవ్యాప్తంగా 14వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 4వ స్థానానికి చేరుకుంది.   తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన జూన్ 2, 2014 అనంతరం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌‌లో ఉన్న అన్ని విభాగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ విధిగా అడాప్ట్ చేసుకోవాల్సి ఉండగా పాలనాపరంగా అనివార్యమైన విభాగాలను మాత్రమే అడాప్ట్ చేసుకొని ఎస్సీ/ఎస్టీ వర్గాలకు సంబంధించిన విభాగాలను అడాప్ట్ చేసుకోవడం మాత్రం వదిలేశారు. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ కమిషన్ విషయంలో జాప్యం చేస్తూ గత ఏడేండ్లుగా ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.

పది నెలల గడిచినా కమిషన్‌‌ ఏర్పాటు కాలే..
 2014లో అడాప్ట్ చేసుకోవాల్సింది పోయి రెండు సంవత్సరాలు కాలయాపన చేసి తేదీ 15–-03– 2016న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చట్టం 2003 (యాక్ట్ 9 ఆఫ్ 2003)ను ఏర్పాటు చేసుకున్నా ఆ కమిషన్ పూర్తిస్థాయి ఏర్పాటుకు మరో రెండేండ్ల పాటు కాల యాపన చేసింది. 02-–01-–2018 తేదీన సాధారణ పరిపాలన శాఖ జీఓ ఎం.ఎస్ 6 ద్వారా చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ  చైర్మన్, 5 గురు సభ్యులలో ఒక్క సుంకా పాక దేవయ్య మాదిగ తప్ప మిగతా వారు పాలక పార్టీకి చెందినవారు కలిసి ఎస్సీ/ ఎస్టీల సంక్షేమం, రక్షణ చట్టాల మీద ఏ మాత్రం అవగాహన లేని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేకంగా ఎలాంటి సేవలు అందించని పార్టీ కార్యకర్తలను చైర్మన్, సభ్యులుగా నియమిస్తూ కమిషన్లు ఏర్పాటు చేశారు. దాంతో కమిషన్ ప్రజలు ఆశించిన స్థాయిలో తమ కర్తవ్యాన్ని నిర్వహించలేదు. ఇలా మూడేండ్ల కాలపరిమితి తేదీ 26 ఫిబ్రవరి, 2021తో పూర్తి  అయిపోయింది. అయినా పాలక ప్రభుత్వం అదే నిర్లక్ష్య ధోరణిని కొనసాగిస్తూ నేటికీ పది నెలలు గడిచినా కమిషన్ ఏర్పాటు చేయకుండా ఇంకా తాత్సారం చేస్తున్నారు. అదే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అభ్యర్థుల కాలపరిమితి ముగిసే కంటే ముందే ఎలక్షన్ కమిషన్ కు ఫలానా తేదీతో అభ్యర్థుల కాలపరిమితి పూర్తి అవుతుంది. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఎలక్షన్ కమిషన్ కు లేఖలు రాసే ప్రభుత్వం ఎస్సీ/ ఎస్టీలకు రక్షణ కవచంగా ఉండే కమిషన్ ఏర్పాటులో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ అంశం పై  కరీంనగర్ వాసి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మేడిపల్లి సత్యం గౌరవ తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్(పి ఐ ఎల్) కేసు ఫైల్ చేయడం జరిగింది. విచారణకు స్వీకరించిన గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం కోర్టులు ఆదేశిస్తే తప్ప కమీషన్ ఏర్పాటు చేయరా? అంటూ మొట్టికాయలు వేస్తూ తదుపరి విచారణ జనవరి 4, 2022న నిర్వహిస్తామని అంతలోపు కమిషన్ ఏర్పాటు చేసి వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించినా నేటికి కమిషన్ ఏర్పాటు దిశగా ఏలాంటి చర్యలకు పూనుకోకపోడం ప్రభుత్వానికి ఎస్సీ/ఎస్టీలపై ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తుంది. 

విచారణకు నోచుకోని పిటిషన్లు..
ఇలా కమిషన్ లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల నుంచి కమిషన్ కు వచ్చి ఫిర్యాదు చేసిన దాదాపు 4 నుంచి 5 వేల పిటిషన్లు ఎలాంటి విచారణకు నోచుకోకుండా నెలల తరబడి పెండింగ్‌‌లో ఉంటున్నాయి. గంపెడు ఆశతో ఎన్నో వ్యయ ప్రయాసలతో హైదరాబాదుకు వచ్చి, కమిషన్‌‌లో ఫిర్యాదు చేయగానే తమకు మేలు జరిగిపోతుందని  ఆశతో ఇళ్లకు వెళ్లిన బాధితులకు వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. కావున ప్రస్తుతం ఉన్న ఈ సమయంలో జాతీయ స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగా ఎస్టీ వేరే కమిషన్ ఎస్సీ వేరే కమిషన్ చేయలేకపోయినా కోర్టు ఆదేశాల మేరకు కనీసం ఉమ్మడిగానైనా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఏర్పాటు అంశంలో ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్య ధోరణి విడనాడి వెంటనే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చట్టం -2003 (యాక్ట్ 9 ఆఫ్ 2003) నిబంధన చాప్టర్ 2 రూల్ (5)(1) (ఏ) ప్రకారం తెలంగాణ రాష్ట్ర నివాసులై ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గాలలోని ప్రాముఖ్యత గల వ్యక్తిని చైర్మన్‌‌గా సబ్ రూల్ (బి) ప్రకారం ఎస్సీ/ఎస్టీ వర్గాలకు న్యాయం అందించేందుకు సమర్థత పూర్తి చిత్తశుద్ధి, నిస్వార్ధ సేవలందించిన అత్యుత్తమ రికార్డు కలిగిన వ్యక్తులు ఐదుగురు సభ్యులతో పూర్తిస్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు.

కాలయాపన చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘిస్తే..
 ఇంకా కాలయాపన చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా మరోసారి ప్రభుత్వం గౌరవ హైకోర్టు ద్వారా మొట్టికాయలు తినాల్సి వస్తుంది. ప్రజాకర్షణ పథకాలతో ఎస్సీ/ఎస్టీ వర్గాలకు ఏ మేర లబ్ది జరుగుతుందో పక్కన పెడితే ఆ వర్గాలకు సంబంధించిన చట్టాలను ఈ స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వలన ప్రభుత్వంపై  వ్యతిరేకంగా ఉన్నారు. రిజర్వ్​డ్​ నియోజక వర్గాల ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఈ చట్టాల అమలు గురించి మాట్లాడకపోవడం జాతి ద్రోహమే అవుతుంది. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కుల, మత, వర్గ, ప్రాంత విభేదాలకు అతీతంగా తమ విధులను పూర్తి చిత్తశుద్ధితో నిర్వహిస్తామని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు ఈ విధంగా ఎస్సీ/ఎస్టీల పట్ల వివక్షతను ప్రదర్శించడం మానుకొని హైకోర్టు తదుపరి విచారణ కంటే ముందే నిబంధనలకు అనుగుణంగా చైర్మన్ మరియు ఐదుగురు సభ్యులతో పూర్తిస్థాయి కమిషన్ ఏర్పాటు చేసి తమ చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ప్రజలు ఆశిస్తున్నారు.