కరోనాతో ప్రభుత్వ డాక్టర్ మృతి

కరోనాతో ప్రభుత్వ డాక్టర్ మృతి

భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ గా చేసిన నరేశ్

డాక్టర్కుటుంబాన్ని ఆదుకోవాలి: ప్రభుత్వానికి డాక్టర్ల విజ్ఞప్తి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్ వో) డాక్టర్ నరేశ్‌ (35) శుక్రవారం కరోనాతో మరణించారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు ప్లాస్మా థెరపీ చేసేందుకు ప్రయత్నించినా శరీరం సహకరించకపోవడంతో చనిపోయారు. డాక్టర్ నరేష్ జిల్లా ఇమ్యునైజేషన్‍ ఆఫీసర్‍(డీఐవో)గా, మణుగూరు కరోనా ఐసోలేషన్ వార్డుకు ఇంచార్జిగా కూడా పని చేశారు. ఇటీవలే ఆయనకు ఉస్మానియా యూనివర్శిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)లో సీటు వచ్చింది. పీజీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే కరోనాకు బలైపోయారు. డాక్టర్ నరేష్ మృతి పట్ల జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, ప్రభుత్వ విప్‍ రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య విచారం వ్యక్తం చేశారు. డాక్టర్ నరేష్ తండ్రి జి. ధర్మరాజు ఆర్టీసీ డ్రైవర్ గా ఐదేళ్ల క్రితం రిటైర్ అయ్యారు.

రూ. కోటి పరిహారం ఇవ్వాలి..

కరోనాతో మరణించిన డాక్టర్ నరేశ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్లు విజ్ఞప్తి చేశాయి. మృతుని కుటుంబానికి కేంద్రం ఇచ్చే రూ.50 లక్షల ఎక్స్‌ గ్రేషియాతో సంబంధం లేకుండా, రాష్ర్ట సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.కోటి ఇవ్వాలని కోరాయి. మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లల చదువులకు డబ్బులు, ఇంటి స్థలం ఇవ్వాలని హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాకాటి కరుణ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌ కు అసోసియేషన్ల ప్రతినిధులు, డాక్టర్ లాలూప్రసాద్‌ , డాక్టర్ కత్తి జనార్దన్‌‌‌‌‌‌‌‌ వినతిపత్రాలు అందించారు. ప్రభుత్వ లాంఛనాలతో నరేశ్‌ అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు.