సర్కార్ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?

సర్కార్ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?

 

  • గద్వాలలో భగీరథ కలుషిత నీళ్లకు మరొకరు బలి.. 4కు చేరిన మృతులు
  •     సీరియస్ గా ఉన్నోళ్లను ఆస్పత్రులకు తరలించని సర్కార్​ 
  •     ఓఆర్ఎస్, జ్వరం గోలీలిస్తూ ఇండ్లల్లోనే ట్రీట్ మెంట్
  •     ఆస్పత్రుల్లోని బాధితులకూ సరైన ట్రీట్ మెంట్ అందుతలే 

గద్వాల, వెలుగు: గద్వాల పట్టణంలో మిషన్ భగీరథ కలుషిత నీళ్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులను సర్కార్ పట్టించుకోవడం లేదు. సరైన ట్రీట్ మెంట్ అందక బాధితులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ముగ్గురు చనిపోగా, శుక్రవారం వేదనగర్ కు చెందిన రామలింగమ్మ (60) మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇండ్లల్లో ఉన్న బాధితులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జ్వరం గోలీలిచ్చి వదిలేయడం, సీరియస్ గా ఉన్నోళ్లను గుర్తించి ఆస్పత్రుల్లో చేర్చకపోవడం, హాస్పిటళ్లలో ఉన్నోళ్లకు సరైన ట్రీట్​మెంట్ అందించకపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. వేదనగర్, గంటగేరి, ధరూర్ మెట్టు, మోహిన్ మల్ల కాలనీల్లో పెద్ద సంఖ్యలో బాధితులు విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నా అధికారులెవరూ అటువైపు వెళ్లడం లేదు.  

ఆ కుటుంబంలో అందరూ బాధితులే..  

చనిపోయిన రామలింగమ్మ కుటుంబంలో అందరూ బాధితులే. ఈమె కొడుకు నాగరాజు, మనువడు నరేందర్, మనవరాలు హిందూ రెండ్రోజుల కిందనే ఆస్పత్రిలో చేరారు. రామలింగమ్మకు కూడా వాంతులు, విరేచనాలైనా ఇంటి దగ్గరే ఓఆర్ఎస్​ప్యాకెట్లు తాగుతూ, జ్వరం గోలీలు వేసుకుంది. ఇంట్లో తల్లి ఒక్కతే ఉండడంతో కూతురు బసమ్మ గురువారం వచ్చి వనపర్తికి తీసుకెళ్లింది. అయితే తన పిల్లలు ఎలా ఉన్నారో చూడాలనే ఆతృతతో శుక్రవారం వనపర్తి నుంచి గద్వాలకు వస్తుండగా రామలింగమ్మ చనిపోయింది. 

150 మంది బాధితులు... 

బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మూడు కాలనీల్లోని జనం నాలుగు రోజుల నుంచి ఓఆర్ఎస్​ప్యాకెట్లు, జ్వరం గోలీలు వాడుతున్నా వాంతులు, విరేచనాలు తగ్గకపోవడంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గద్వాల సర్కార్ దవాఖానాలో 96 మంది ట్రీట్ మెంట్ పొందుతున్నారు. వీరిలో 28 మంది పిల్లలే ఉన్నారు. 10 మందికి పైగా సీరియస్ గా ఉంటే, ముగ్గురిని కర్నూలుకు తరలించారు. పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో వరండాలో అదనపు బెడ్లు వేస్తున్నారు. వీళ్లే కాకుండా కర్నూలు, ఇతర ప్రైవేట్​హాస్పిటల్స్​లో చాలామందే ట్రీట్​మెంట్​తీసుకుంటున్నారు. బాధితులు దాదాపు 150 మంది వరకు ఉంటారని స్థానికులు చెబుతున్నారు. కాగా, గద్వాల ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న బాధితులకు ఎలాంటి టెస్టులు చేయడం లేదు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గోలీలు ఇస్తూ సెలైన్లు పెడుతున్నారు. టెస్టులు చేస్తేనే ఏమైందో తెలుస్తుందని, అప్పుడే సరైన ట్రీట్ మెంట్ ఇవ్వొచ్చని ఓ డాక్టర్ చెప్పారు. విరేచనాలు ఎక్కువైతే డిహైడ్రేషన్ తో చనిపోతారని హెచ్చరిస్తున్నారు. 

కలుషిత నీళ్లు కారణం కాదట! 

కలుషిత నీళ్లతోనే ఇలా జరిగిందని స్థానికులు అంటుంటే.. మున్సిపల్, మెడికల్ ఆఫీసర్లు మాత్రం కాదని అంటున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జనకు వెళ్లడం, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడంతో వాంతులు, విరేచనాలు అవుతున్నాయని రెండ్రోజుల కింద డీఎంహెచ్ఓ ప్రకటించారు. కానీ ఈ మూడు కాలనీల్లో చాలా మందికి టాయిలెట్స్ ఉన్నాయి. మరోవైపు 150 మందికి ఒకేసారి ఇలా ఎట్ల జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీళ్లను టెస్టు చేశామని, రిపోర్టు నార్మల్ గా ఉందని మున్సిపల్​అధికారులు చెబుతున్నా .. శుక్రవారం ఉదయం నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. ప్రస్తుతం మూడు కాలనీలకు మినరల్ వాటర్ సరఫరా చేస్తున్నారు. కాగా, కలుషిత నీళ్లతోనే ఇలా జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని మున్సిపల్​చైర్మన్ బీఎస్​కేశవ్ సవాల్​చేశారు. ఇన్ని సాక్ష్యాలున్నా నేతలు, అధికారులు ఇలా మాట్లాడడంపై స్థానికులు మండిపడుతున్నారు. 

ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా: డీకే అరుణ  

టీఆర్ఎస్ సర్కార్ కు ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కలుషిత నీళ్లు తాగి జనాలు చనిపోతుంటే, ఆ పార్టీ నేతలు ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మిషన్ భగీరథ నీళ్లు తాగాలని డిమాండ్ చేశారు. శుక్రవారం వేదనగర్, గంటగేరి, మోహిన్ మల్ల కాలనీల్లో అరుణ పర్యటించి బాధితులను పరామర్శించారు. రామలింగమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. తర్వాత సర్కార్ దవాఖానకు వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.