పల్లె ప్రగతి, మన ఊరు.. మన బడికి స్పందన కరవు!

పల్లె ప్రగతి, మన ఊరు.. మన బడికి స్పందన కరవు!

నల్గొండ, వెలుగు: పల్లె ప్రగతి, మన ఊరు మన బడి కార్యక్రమాల్లో దాతలను భాగస్వాములను చేయాలన్న సర్కారు ఆలోచనకు స్పందన కరవవుతోంది. పల్లెప్రగతి ప్రారంభమైన మొదట్లో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. తర్వాత నాలుగు విడతల్లో జరిగిన కార్యక్రమాల్లో విరాళాలు అంతగా రాలేదు. పల్లె ప్రగతి పనులకు, బడుల బాగోగులకు సర్కారే నిధులు ఇవ్వకపోవడంతో దాతలు సైతం  విముఖత చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ ఫేజ్​లో నెల రోజులపాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరిగాయి. తర్వాత నుంచి 15 రోజులకు కుదించారు. రెండు, మూడు విడతల వరకు గ్రామాలకు భారీగా డబ్బులు రిలీజ్ చేసిన సర్కారు ఆ తర్వాత నుంచి ఫండ్స్ రిలీజ్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తోంది. ఈ ప్రభావం విరాళాలు ఇచ్చే దాతలపైనా పడింది. ఫండ్స్ ఇవ్వడం లేదని ఓవైపు స్థానిక ప్రజాప్రతినిధులే ఆందోళన చేస్తుండటంతో దాతలు కూడా ముందుకు రావడం లేదని అధికారులు అంటున్నారు.

ఈ నెల 3న ప్రారంభమైన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఆరు రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని పది జిల్లాల్లో నయాపైసా విరాళాలు రాలేదు. ఏడు జిల్లాల్లో మాత్రం 500 నుంచి 22 వేల వరకు విరాళాలు ఇచ్చారు. మిగిలిన 15 జిల్లాల్లో మాత్రమే నామమాత్రంగా విరాళాలు వచ్చాయి. ఏ జిల్లాలో చూసినా ఇద్దరు, ముగ్గురు మాత్రమే దాతలు ముందుకు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 151 మంది విరాళాలు ఇచ్చారు. ఇందులో నగదుతోపాటు వస్తువులు (ఆర్టికల్స్) కూడా ఉన్నాయి. వీటి విలువ మొత్తంగా రూ.94,16,766 మాత్రమే. అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి రూ. 48,40,802, సిద్దిపేట జిల్లాలో రూ.13.51 లక్షలు వచ్చాయి. సూర్యాపేట  జిల్లాలో రూ.7,77,600 విరాళంగా ఇచ్చారు.

ఆఫర్లు ప్రకటించినా..

విరాళాలు ఇచ్చిన దాతలకు సర్కారు ఆఫర్లు ప్రకటిస్తున్నా ఆసక్తి చూపడం లేదు. ఫస్ట్ ఫేజ్​లో ముందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం ఈసారి విరాళాలు ఇచ్చేందుకు అయిష్టంగా ఉన్నారు. పల్లె ప్రగతిలో విరాళాలు ఇచ్చే డోనర్స్ ఫోటోలు గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో పెడ్తామని చెప్పారు. ఎవరైనా స్థలం ఇస్తే దానికి దాతల పేర్లు పెడ్తామని ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే కోఆప్షన్ మెంబర్ పదవి సైతం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.2 లక్షలు ఇస్తే దాత పేరును తీర్మానంలో చేరుస్తామని, పదిలక్షల పైన ఇస్తే ఒక క్లాస్ రూమ్​కు పేరు పెడ్తామని ప్రభుత్వం చెప్పింది. రూ. 25 లక్షలు దాటితే ప్రైమరీ స్కూల్​లో ఒక బ్లాక్​కు, రూ.50 లక్షలు దాటితే యూపీఎస్​లో ఒక బ్లాక్​కు, రూ. కోటి దాటితే హైస్కూల్​లో ఒక బ్లాక్​కు దాత పేరు పెడ్తామన్నారు. కానీ ఇప్పటివరకు స్కూల్ డెవలప్​మెంట్​పైసలే ఇవ్వకపోవడంతో ఇక విరాళాలు ఇచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారని జిల్లా విద్యాశాఖ అధికారులు అంటున్నారు. స్కూల్ మేనేజ్​మెంట్​కమిటీల్లో సభ్యులుగా చేరుస్తామని చెపుతున్నా దాతలు ఇంట్రస్ట్ చూపడం లేదని చెబుతున్నారు.