ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : ఈవీలపై 20% డిస్కౌంట్.. ఉద్యోగులకు మంత్రి పొన్నం ఆఫర్

 ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : ఈవీలపై 20% డిస్కౌంట్.. ఉద్యోగులకు మంత్రి పొన్నం ఆఫర్
  • సర్కారు వెహికల్స్ లోనూ ఈవీల సంఖ్య పెంచుతాం 
  • రాష్ట్రంలో ఏడాదిలో లక్ష ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ అయ్యాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) లు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రభుత్వం వాడే వాహనాల్లో కూడా 20 నుంచి 30 శాతం ఈవీలు ఉండేలా కార్యాచరణ తీసుకుంటామన్నారు. మంగళవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో ఈవీలపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాబోయేతరానికి మంచి జీవితం కోసం జీవో 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు.

"ఏడాది కాలంలో లక్ష ఈవీలు అమ్ముడుపోయాయి. గతంలో ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కి.మీ. ప్రయాణించే కెపాసిటీ ఉన్న ఈవీలు ఇప్పుడు 500 కి.మీ. ప్రయాణించే కెపాసిటీకి చేరాయి. కార్యాలయాలు, గ్రేటర్ కమ్యూనిటీ హాల్ లు, విద్యాలయాల వద్ద కూడా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చర్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వంపై రూ. 900 కోట్లభారం పడుతున్నప్పటికీ, ఈవీ పాలసీని అమలు చేస్తాం. రాష్ట్రంలో గతంలో 0.3 శాతం ఉన్న ఈవీల సేల్స్ ఇప్పుడు 2 శాతానికి పెరిగాయి. రెడ్కోద్వారా చార్జింగ్ స్టేషన్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వవాహనాలు, పాఠశాల బస్సులు, ఫార్మా, ఐటీ వాహనాలు 25 నుంచి 50 శాతం వారి అవసరాలు బట్టి ఈవీలు కొనేలా విధానం తీసుకురాబోతున్నాం" అని మంత్రి పొన్నం ప్రకటించారు. 

ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రంగా ఉందని, హైదరాబాద్ లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈవీలు, సీఎన్జీ, ఎల్పీజీ వాహనాల వినియోగం పెంచుతున్నామని తెలిపారు. "ఢిల్లీలో ఏక్యూఐ 400 దాటిపో యింది. కాలుష్య నివారణకు ప్లాంటేషన్ పెంచాలి. ఈవీల వినియోగం పెంచాలి. ఈవీల వినియోగం లో దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్​ గా  ఉండాలి. రాబోయే తరానికి కాలుష్యరహిత తెలంగాణను అందించాలి" అనిమంత్రి సూచించారు.