- మరో మూడు రోజుల్లో ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్
- తమకు అనుకూల ప్లేస్ సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగులు
- ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల లెటర్ల కోసం ప్రదక్షిణలు
- 40 శాతం బదిలీ రూల్స్‌ను అనుకూలంగా మార్చుకుంటున్న వైనం
- దీర్ఘకాలంగా పాతుకుపోయిన వారూ ఇక్కడే ఉండేందుకు ప్రయత్నాలు
మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీ ప్రక్రియ మొదలుకావడంతో అంతేస్థాయిలో పైరవీలు జోరందుకున్నాయి. మరో మూడు రోజుల్లో ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ రానుండడంతో తాము కోరుకున్న చోటుకు ట్రాన్స్‌ఫర్ అయ్యేందుకు ఆఫీసర్లు, ఉద్యోగులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివిధ డిపార్ట్‌మెంట్లలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన మరికొందరు అక్కడి నుంచి కదలడానికి కూడా ఇష్టపడడం లేదు. ఈ క్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులను, ప్రజాప్రతిధులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘సార్.. మీరు చెప్పినట్టు వింటాం... మీకు అనుకూలంగా పనిచేస్తాం’ అంటూ ఇప్పటికే కొంతమంది పైరవీ లెటర్లు సంపాదించినట్టు సమాచారం.
మూడు రోజుల్లో ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్
రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఐదేండ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఇటీవల ప్రభుత్వం ఎత్తి వేసింది. ఈ నెల 5 నుంచి 20లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం 5 నుంచి 8 వరకు బదిలీలకు అర్హులను, కేటగిరీల వారీగా ఖాళీలను ప్రకటించారు. 9 నుంచి 12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. 13 నుంచి 18 వరకు అప్లికేషన్లను పరిశీలించి మాస్టర్ లిస్ట్‌ను తయారు చేస్తారు. 19, 20 తేదీల్లో ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు జారీ కానున్నాయి. బదిలీ అయిన ఉద్యోగులు మూడు రోజుల్లో ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ అయి కొత్త పోస్టింగ్‌లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లు, రాష్ట్ర స్థాయి కేడర్లకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది.
కేడర్ల వారీగా పోస్టులు
అటెండర్లు, రికార్ట్ అసిస్టెంట్లు, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు జిల్లా పరిధిలో బదిలీ కానున్నారు. జోన్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు, గ్రేడ్ 1, 2, 3 పంచాయతీ సెక్రటరీలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెన్నీషియన్లు, వెటర్నరీ అసిస్టెంట్లు జోన్ పరిధిలోని జిల్లాలకు బదిలీ కానున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఏఎస్‌డబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు, ఏటీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ సివిల్ సర్జన్లు మల్టీ జోన్ పరిధిలోకి వస్తారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా అధికారులతో పాటు సివిల్ సర్జన్లు, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
40 శాతమే బదిలీలు...
ఆయా డిపార్ట్‌మెంట్లలో 40 శాతం మంది ఆఫీసర్లు, ఉద్యోగులు మాత్రమే ట్రాన్స్‌ఫర్ కానున్నారు. ఒక స్థానంలో నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా ట్రాన్స్‌ఫర్ చేయాలన్న ఆదేశాలు ఉన్నాయి. రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు కోరుకున్న చోట ఖాళీలుంటే బదిలీ చేయవచ్చు. అయితే 40 శాతం బదిలీలను ఆసరాగా చేసుకొని కొంతమంది అధికారులు, సిబ్బంది తాము కోరుకున్న చోటుకు ట్రాన్స్‌ఫర్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జోన్, మల్టీ జోన్ పరిధిలో సొంత ప్రాంతాలకు దూరంగా పనిచేస్తున్న వారు తమ స్వస్థలాలకు దగ్గరగా వెళ్లాలని కోరుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీలు, ఆదాయం వచ్చే శాఖల్లో పనిచేస్తున్న మరికొందరు మాత్రం ప్రస్తుత స్థానాల నుంచి కదలడానికి ససేమిరా అంటున్నారు.
ఉన్నతాధికారులు, లీడర్ల చుట్టూ ప్రదక్షిణలు
కోరుకున్న స్థానాలకు బదిలీ అయ్యేందుకు కొంతమంది అధికారులు, ఉద్యోగులు జోరుగా పైరవీలు సాగిస్తున్నారు. ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు రావడానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో తమకు అనుకూలమైన పోస్టింగ్ సాధించుకునేందుకు ఉన్నతాధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల లీడర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలతో సంబంధం ఉన్న శాఖల్లో పని చేస్తున్నవారు ఇప్పటికే ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. వారిలో కొందరు పాత స్థానాలకు రావడానికి ట్రై చేస్తున్నారు. మరికొందరు బదిలీలను తప్పించుకునేందుకు ఇతర శాఖల్లోకి డిప్యూటేషన్‌పై వెళ్లారు. అటెండర్ నుంచి అధికారి వరకు ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారందరికీ ట్రాన్స్‌ఫర్లు తప్పనిసరి కావడంతో టెన్షన్ పడుతున్నారు. కొంతమంది బదిలీలను తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నారు.