పండ్లు మినహా కూరగాయల్ని పచ్చిగా తినేందుకు ఇష్టపడరు చాలా మంది. వీటిని ఎక్కువగా ఉడకబెట్టి లేదా వండుకునే తింటారు. కానీ, ఇలా వండడం వల్ల వాటిలోని పోషకాలు చాలా వరకు తగ్గిపోతాయి. అందుకే కొన్ని రకాల కూరగాయల్ని పచ్చిగా తింటేనే పోషకాలు అందుతాయి
బ్రకోలి: ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే బ్రకోలి వంటి కూరగాయల్లో విటమిన్ సి , క్యాల్షియం అధిక స్థాయిలో ఉంటాయి. అలాగే రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల్ని నియంత్రించే సల్ఫరాఫెన్ అనే పదార్థం కూడా బ్రకోలిలో ఉంటుంది. అయితే దీన్ని ఉడకబెట్టడం వల్ల 70 శాతం పోషకాలు కోల్పోతాయి. అందువల్ల దీన్ని మంచి నీటితో శుభ్రంగా కడిగి, పచ్చిగా తినాలి. అలా ఉంటే పూర్తి స్థాయి పోషకాలు అందుతాయి.
బెర్రీస్: బాదం, పిస్తావంటి వాటిని డ్రైగా తినోచ్చు కానీ, స్ట్రా బెర్రీ, బ్లూ బెర్రీ లాంటి పళ్లను డ్రైగా తినకూడదు. ప్రస్తుతం ఈ రకం పండ్లు ఎక్కువగా డ్రైగానే లభిస్తున్నాయి. వీటిని ఎండబెట్టి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటిలోని విటమిన్స్, మినరల్స్ చాలా వరకు తొలగిపోతాయి. అందువల్ల బెర్రీ పండ్లను పచ్చివి.. లేతవి మాత్రమే తినాలి.
క్యాప్సికమ్ : బెల్ పెప్పర్ వంటి క్యాప్సికమ్ జాతి కూరగాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని ఉడకబెట్టినా, వేడి తగిలేలా చేసినా పోషకాల దాదాపు తగ్గిపోతాయి. అందువల్ల క్యాప్సికమ్ ను కడిగి, పచ్చిగానే ఆహార పదార్థాల్లో చేర్చుకోవాలి. అసలు విటమిన్ సీ ఉన్న ఏ పదార్దాన్ని ఉడకబెట్ట కూడదు.
మొలకలు : పెసలు బొబ్బర్లు, చిక్కుళ్లు వంటి వాటిని మొలకలుగా చేసుకుని తింటుంటారు. మొలకలో విటమిస్ సి , పీచు పోలేట్, కాపర్, మాంగనీస్ వంటి న్యూట్రియెంట్స్ అధికంగా ఉంటాయి. అయితే ఎక్కువ మంది మొలకల్ని పచ్చిగా తినేందుకు ఇష్టపడరు. వీటిలో మిర్చి, ఉల్లిలాంటివి చేర్చి వేడిగా ఫ్రై చేసుకుని తినడం ఎక్కువ మందికి అలవాటు ఇలా చేయడం వల్ల పోషకాలు చాలా వరకు పోతాయి. అందువల్ల వీటిని పచ్చిగా తింటేనే ప్రయోజనం ఉంటుంది
బీట్ రూట్ : విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, పీచు, మాంగనీస్ వంటి పోషకాలు బీట్ రూట్లో పుష్కలంగా లభిస్తాయి. బీట్ రూట్ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తక్షణ శక్తి లభించడంతోపాటు, రక్తపోటు అదుపులో ఉంటుంది. అయితే బీట్ రూట్ ను ఉడకబెట్టి తింటే వీటిలోని 25 శాతంపైగా పోషకాలు తొలగిపోతాయి. కాబట్టి బీట్ రూట్ పచ్చిగానే తినాలి. ఉల్లి, క్యారెట్, దోస, ఇతర కూరగాయ ముక్కలతో కలిసిన సలాడ్లుగా తీసుకోవచ్చు
కొబ్బరి: ద్రవ పదార్థాలుగా తీసుకునే ఎలక్ట్రోలైట్స్ వంటి పోషకాలు పచ్చి కొబ్బరిలో అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కొబ్బరిలో పుష్కలం.. కొబ్బరిని పచ్చిగా తినడం వల్ల ఈ పోషకాలు అధికంగా లభిస్తాయి. డీహైడ్రేషన్ తో. బాధపడుతున్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగడంతోపాటు, పచ్చికొబ్బరిని కూడా తినాలి. ఎండు కొబ్బరిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి
జామ: విటమిన్ ఎ, విటమిస్ సి , కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు జామ నుంచి లభిస్తాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండ్లను ఉడకబెట్టడం, వండుకోవడం చేస్తుంటారు. దీనివల్ల వాటిలోని పోషక విలువలు చాలా వరకు తగ్గిపోతాయి. అందువల్ల జామ పండ్లను వేడి తగలకుండా ఉడకపెట్ట కుండా తింటే వాటిలోని పోషకాల్ని అధికంగా పొందొచ్చు
వెల్లుల్లి: వంటలో వాడే ఆహార పదార్ధాలో వెలుల్లి ప్రధానమైంది. ఘాటు, రుచి కోసం వెల్లుల్లిని వండి తింటుంటాం. దీని వాసన కారణంగా ఎవరూ పచ్చిగా తినడానికి ఇష్టపడరు. అయితే దీన్ని పచ్చిగా తింటేనే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వెల్లుల్లి లో ఎల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్ ను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అయితే వెల్లులిని వండడం వల్ల ఎల్లిసిన్ ను కోల్పోవాల్సి ఉంటుంది. అందువల్ల రోజూ మూడు నాలుగు దెబ్బలు వెల్లుల్లిని పచ్చిగానే తినాలి
