‘పాలిటెక్నిక్’లే ఇంజినీరింగ్ కాలేజీలు

‘పాలిటెక్నిక్’లే ఇంజినీరింగ్ కాలేజీలు
  • తొలి విడత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు యోచనలో ప్రభుత్వం
  • ఎన్​ఈపీ అమల్లో భాగంగా అధికారుల కసరత్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల సంఖ్యను పెంచేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ముందుగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలిటెక్నిక్ కాలేజీలను అప్​గ్రేడ్ చేసి, వాటి స్థానంలో ఇంజినీరింగ్ కాలేజీలు పెట్టాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా చర్చలు నడుస్తున్నాయి. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2023–24 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. 

రాష్ట్రంలో 52 సర్కారు పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి. అయితే, పాలిటెక్నిక్ కాలేజీల స్థానంలో ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు  చేయాలని  నేషనల్ ఎడ్యుకేషన్​ పాలసీలో పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారికంగా ఎన్​ఈపీని అమలు చేయకపోయినా, కేంద్రం నుంచి అమలు చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సర్కారు ఇంజినీరింగ్ కాలేజీలకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11 సర్కారు ఇంజినీరింగ్ కాలేజీలుండగా, వాటిలో ఆరు జేఎన్టీయూ పరిధిలోనే ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్క సర్కారు ఇంజినీరింగ్ కాలేజీ కూడా లేదు. రెండేండ్ల కింద సిరిసిల్ల జిల్లాకు మంజూరు చేసిన కాలేజీని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని కామారెడ్డిలో పెట్టాలని భావించినా.. పలు కారణాలతో అది సిరిసిల్ల జిల్లాలోనే ఏర్పాటు చేశారు. 

జిల్లాకో కాలేజీ రాలే...

పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య కూడా పెరగడం లేదు. అయితే,  ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని టీఆర్ ఎస్ అధికారంలోకి రాకముందు 2014లో తన మేనిఫెస్టోలో పేర్కొన్నది. ఆ హామీ ఇప్పటికీ అమలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోనూ పాలిటెక్నిక్ కాలేజీల స్థానంలో ఇంజినీరింగ్ కాలేజీలను పెట్టాలని సూచన చేసింది. దీంతో ముందుగా జిల్లా కేంద్రాల్లో ఈ విధానం అమలు చేసి, తర్వాత మిగిలిన కాలేజీల్లో అమలు చేస్తే బాగుంటుందనే భావనలో టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులున్నారు. కాగా, పాలిటెక్నిక్ కాలేజీలకు అవసరమైన స్థలంతో ఫర్మిచర్​ కూడా ఉండడంతో ఇంజినీరింగ్​కాలేజీల ఏర్పాటుకు  ఫైనాన్షియల్​గా ఇబ్బందులు ఉండబోవని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశముందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు.