టెన్త్ బయాలజీ, మ్యాథ్స్​లో మార్కులు

టెన్త్ బయాలజీ, మ్యాథ్స్​లో మార్కులు

హైదరాబాద్, వెలుగు :  పదో తరగతి స్టూడెంట్లకు ప్రభుత్వ పరీక్షల విభాగం శుభవార్త చెప్పింది. బయాలజీ, మ్యాథ్స్​ సబ్జెక్టుల్లో క్వశ్చన్లు సరిగా ఇవ్వని వాటికి మార్కులు కలపాలని నిర్ణయించింది. ఇటీవలే టెన్త్ పబ్లిక్ పరీక్షలు పూర్తికావడంతో గురువారం నుంచి స్పాట్ వాల్యువేషన్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఏఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు కలపాలనే దానిపై ఎగ్జామినర్లకు ఆదేశాలిచ్చారు.  బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులో రెండో విభాగంలో ఆరో క్వశ్చన్ బ్లూప్రింట్ కు విరుద్ధంగా ఇవ్వడంతో దాంట్లో రెండు క్వశ్చన్లకు మార్కులు ఇవ్వాలని ఎక్స్ పర్ట్ కమిటీ నిర్ణయించింది. నాలుగు సబ్ క్వశ్చన్లలో తొలి రెండు ప్రశ్నలను ఆన్సర్ చేసేందుకు ప్రయత్నించిన ప్రతి స్టూడెంట్ కు రెండు మార్కులు ఇవ్వాలని, 3,4  ప్రశ్నలకు సరైన ఆన్సర్ రాస్తేనే మార్కులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

అదే రెండో విభాగంలో ఐదో క్వశ్చన్ కు ఇంగ్లిష్ మీడియంలో వెజిటేటీవ్ అనే పదం లేకుండా ఇవ్వడంతో.. ఆ క్వశ్చన్​కు రిలవెంట్ ఆన్సర్ రాస్తే మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. మ్యాథ్స్ సబ్జెక్ట్ లో 3వ క్వశ్చన్ సరిగా ఇవ్వకపోవడంతో, తెలుగు మీడియం మినహా మిగిలిన అన్ని మీడియాల్లో దాన్ని రాసేందుకు ప్రయత్నించిన వారందరికీ రెండు మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, ఉర్దూ మీడియంలో మ్యాథ్స్ సబ్జెక్టులో 12వ ప్రశ్న ట్రాన్స్ లేషన్ సరిగా చేయకపోవడంతో, దాన్ని అటెంప్ట్  చేసిన స్టూడెంట్లకు 4 మార్కులు ఇవ్వాలని డి సైడ్ చేశారు.  కాగా, మార్చి 29న ‘టెన్త్ బయాలజీ క్వశ్చన్ పేపర్​ లో పొరపాట్లు’ పేరుతో సమస్యను ‘వెలుగు’ దినపత్రిక ప్రచురించిన విషయం తెలిసిందే.