అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ..ప్రజల జీవితాల్లో మార్పు కోసం సవాళ్లను గుర్తించాలి

అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ..ప్రజల జీవితాల్లో మార్పు కోసం సవాళ్లను గుర్తించాలి
  • నీతి ఆయోగ్ కేంద్ర ప్రభారీ, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అన్వేష్ కుమార్

ములుగు, వెలుగు :  ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో ప్రత్యేకశ్రద్ధ చూపాలని నీతి ఆయోగ్ ​ప్రభారీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అన్వేష్​ కుమార్​సూచించారు. శుక్రవారం ములుగు కలెక్టరేట్ లో కన్నాయిగూడెం బ్లాక్‌‌ కార్యక్రమంపై కలెక్టర్ దివాకర టీఎస్, అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు తో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.  

కన్నాయిగూడెం బ్లాక్ అభివృద్ధిలో భాగంగా నిర్దేశిత ఐదు ప్రధాన రంగాల్లో సాధించిన ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం, పోషకాహారం, గర్భిణులకు తొలి మూడు నెలల్లో నమోదు, సుఖ ప్రసవాలు, పిల్లల్లో పోషకాహార లోపం, అంగన్‌‌వాడీ కేంద్రాల్లో సదుపాయాల లభ్యత, వ్యవసాయం, అనుబంధ సేవలు, కిసాన్ క్రెడిట్ కార్డు పంపిణీ, సూక్ష్మ నీటిపారుదల విస్తీర్ణం, సాయిల్ హెల్త్ కార్డుల జారీ, పశువులకు టీకాలు, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి, ప్రధానమంత్రి ఆవాస్​యోజన వంటి అంశాలపై  సమీక్షించారు. 

ఈ సందర్భంగా అన్వేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పథకాల కలయిక, కేంద్ర ప్రభారీ అధికారులు,  కలెక్టర్ల సహకారం, బ్లాక్‌‌ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ  మూడు ప్రధాన సూత్రాలపైనే కార్యక్రమ విజయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.  కన్నాయిగూడెం బ్లాక్‌‌లో పథకాల అమలులో అధికారుల అంకితభావం అభినందనీయమన్నారు. అయినా కీలక సూచికల్లో మరింత వేగంగా అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. 

క్షేత్రస్థాయిలోని సవాళ్లను గుర్తించి, లక్ష్యంమేరకు  ప్రజల జీవితాల్లో త్వరితగతిన మార్పు తీసుకురావాలని ఆదేశించారు. స్థానిక పరిపాలనలో జవాబుదారీతనాన్ని, పారదర్శకతను పెంచడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, నీతి ఆయోగ్ బ్లాక్ కో – ఆర్డినేటర్ రవీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.