
- రాష్ట్రవ్యాప్తంగా జులైలో 49 శాతం మంది పిల్లలు ఆబ్సెంట్
- పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ డుమ్మాలు
- స్పెషల్ డ్రైవ్ ద్వారా హాజరుశాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం
- మొబైల్ అంగన్‌వాడీల ఏర్పాటుపైనా ఆలోచన
- ఆట వస్తువులు, ఎగ్ బిర్యానీ, బాలామృతంలో కొత్త ఫ్లేవర్స్‌తో చిన్నారులను ఆకట్టుకునే యత్నం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో అటెండెన్స్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తక్కువ హాజరుశాతం నమోదవుతున్న కేంద్రాలను గుర్తించింది. వీటిలో అటెండెన్స్ పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది.
గత నెల 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా 49 శాతం మంది పిల్లలు ఒక్కరోజు కూడా అంగన్‌వాడీ సెంటర్లకు రాలేదని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. 6 శాతం మంది గర్భిణులు ఒక్క రోజు కూడా రాకపోగా, 69 శాతం మంది 16 నుంచి 21 రోజులు వచ్చారు.
10 శాతం మంది బాలింతలు ఒకరోజు కూడా అంగన్‌వాడీ కేంద్రాలకు రాలేదు.. 68 శాతం మంది బాలింతలు 16 నుంచి 21 రోజులపాటు సేవలు పొందారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి విధిగా హాజరును నమోదు చేస్తున్నారు. దీంతో హాజరు, గైర్హాజరు లెక్కలు పక్కాగా తేలుతున్నాయి . దీని ఆధారంగా ఎక్కడ లోపం ఉందో గుర్తించి, సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది.
పట్టణ ప్రాంతాల్లో తక్కువ అటెండెన్స్
పట్టణ ప్రాంతాల్లో ఉన్న అంగన్‌వాడీల్లో అటెండెన్స్ తక్కువగా నమోదవుతున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరితోపాటు పలు కార్పొరేషన్లలో పిల్లలు, గర్భిణులు, బాలింతల అటెండెన్స్ తక్కువ ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఈ సెంటర్లలో స్పెషల్ డ్రైవ్‌తో హాజరు శాతం పెంచేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వ జాగా లేకపోవటంతో మొబైల్ అంగన్‌వాడీలను ఏర్పాటు చేయాలని సర్కారు ఆలోచిస్తున్నది.
ఎగ్ బిర్యానీ, బాలామృతంలో కొత్త ఫ్లేవర్స్
అంగన్‌వాడీ సెంటర్లకు వచ్చేలా చిన్నారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం వారానికి 2 సార్లు ఎగ్ బిర్యానీ అందిస్తున్నది. పిల్లలకోసం 58 రకాల ఆట వస్తువులను అందించింది. బాలామృతంలో ఒకే ఫ్లేవర్ ఉండటంతో పిల్లలు ఎక్కువ తినడం లేదని అధికారులు దృష్టికి తేవడంతో వీటిలో 2,3 ఫ్లేవర్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పోషకాహారంతోపాటు త్వరలో అల్పాహారాన్ని కూడా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. టీజీ ఫుడ్స్ ద్వారా రెడీమేడ్ బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా సిద్ధం చేయిస్తున్నారు. మిల్లెట్ మిక్స్, ఉప్మా మిక్స్ పౌడర్లను అంగన్‌వాడీలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. వేడి నీళ్లలో ఈ పౌడర్లను వేయగానే అల్పాహారం రెడీ అయిపోతుంది. దాన్ని పిల్లలకు ఇవ్వడం ద్వారా పోషకాహారం అందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.