కమ్మ, వెలమ కుల సంఘాల భూముల్లో పనులు చేయొద్దు : హైకోర్టు

కమ్మ, వెలమ కుల సంఘాల భూముల్లో పనులు చేయొద్దు : హైకోర్టు
  • మార్కెట్ విలువ ఎంత ఉందో నిర్ణయించాలి
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • ఒక్కో సంఘానికి ఐదెకరాలు కేటాయింపుపై విచారణ

హైదరాబాద్‌‌, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని హైటెక్‌‌ సిటీ ఏరియాలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువ నిర్ణయించాలని రాష్ట్ర సర్కార్​ను హైకోర్టు ఆదేశించింది. ఒక్కో కుల సంఘ భవనానికి ప్రభుత్వం 5 ఎకరాలు కేటాయించింది. జీవో 571 ప్రకారం మార్కెట్‌‌ ధరను ప్రభుత్వం అంచనా వేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌‌ నివేదించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నామని ప్రకటించింది. 

ఖానామెట్‌‌‌‌లోని సర్వే నెం.41/15లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం ఐదు ఎకరాలు చొప్పున కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం 2021, జూన్‌‌‌‌ 30న జారీ చేసిన జీవో 47ను సవాల్‌‌‌‌ చేస్తూ రిటైర్డ్​ ప్రొఫెసర్‌‌‌‌ ఎ.వినాయక్‌‌‌‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరధే, జస్టిస్‌‌‌‌ టి.వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 

ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టొద్దన్న గత మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌‌‌‌ తరఫున అడ్వకేట్ జనరల్‌‌‌‌ బీఎస్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ వాదనలు వినిపించారు. 2012, సెప్టెంబర్‌‌‌‌ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఆ రెండు సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్‌‌‌‌ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. కుల సంఘాలకు భూమి కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది కల్పించుకుని, ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌‌‌‌ను ఆమోదించొద్దని, మధ్యంతర ఉత్తర్వులను సవరించొద్దని కోరారు. 

దీనిపై స్పందించిన హైకోర్టు, గత మధ్యంతర ఉత్తర్వులను పూర్తిగా సవరించడం లేదని వివరించింది. ఇదిలా ఉండగా, తమ భూమిని ప్రభుత్వం కుల సంఘాలకు కేటాయించిందని, ఈ పిటిషన్​లో తమను ప్రతివాదులుగా పరిగణించి వాదనలు వినాలని కోరుతూ అశోక్‌‌‌‌, ఇతరులు దాఖలు చేసిన ఇంప్లీడ్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ను డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ కొట్టేసింది. ప్రజాహిత వ్యాజ్యంలో భూమి యాజమాన్య హక్కులు, సివిల్‌‌‌‌ వివరాలను విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది.