హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌లో వెల్ఫేర్‌కు సర్కారు పెద్దపీట వేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ కు భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ మేరకు బడ్జెట్‌లో ఆయా వర్గాలకు భారీగా నిధులు కేటాయించారు.
బీసీ వెల్ఫేర్ కు రూ. 9,200 కోట్లు, ఎస్సీ వెల్ఫేర్ కు రూ.33,124 కోట్లు, ఎస్టీ వెల్ఫేర్ కు రూ.17,056 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ. 3,003 కోట్లు ప్రతిపాదించారు. ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.400 కోట్లు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ కోసం రూ.100 కోట్లు, రజకులకు రూ.150 కోట్లు, వడ్డెర కార్పొరేషన్ కు రూ. 50 కోట్లు, కృష్ణ బలిజ కార్పొరేషన్, వాల్మీకి బోయ, బట్టురాజు కార్పొరేషన్, మేదర, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి కార్పొరేషన్ కు రూ.50 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది.
గీత కార్మికులకు రూ.68 కోట్లు, సగర కార్పొరేషన్ కు 50 కోట్లు, నీరా పాలసీకి రూ. 25 కోట్ల కేటాయింపులు చేసింది. వీటితోపాటు ఈ కులాల 9 కో ఆపరేటివ్ సొసైటీలకు ఒక్కో దానికి రూ.50 కోట్లు నిధులు కేటాయించారు. బీసీ కాలేజీలు, స్కూళ్లకు రూ. 552 కోట్లు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు 700 కోట్లు కేటాయించారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ కు రూ. 38 కోట్లు, ఎస్టీ అవాసాల్లో విద్యుత్ కు రూ.12 కోట్లు, ఐటీడీఏకు రూ.40 కోట్లు ప్రతిపాదించారు. ఆత్మ గౌరవ భవనాల కోసం రూ.100 కోట్లు కేటాయించారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రూ. 2వేల కోట్లు
రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టల్స్ ను ఒకే క్యాంపస్ లో నిర్మించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌స్కూల్స్ నుఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. మధిర, కొడంగల్ నియోజకవర్గాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో రూ. 100 కోట్ల నుంచి రూ.125 కోట్ల వ్యయంతో రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్స్ ను నిర్మించనున్నారు.
వీటికి డిజైన్ల ఖరారు చివరి దశకు చేరుకుంది. కాగా, వీటి నిర్మాణానికి బడ్జెట్ లో ప్రభుత్వం రూ.2 వేల కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఈ అకాడమిక్ ఇయర్లో సుమారు 20 స్కూళ్లను నిర్మించనున్నారు. కాగా, ఇప్పటికే 8 నియోజకవర్గాల్లో ల్యాండ్ రెడీగా ఉందని కలెక్టర్లు
ప్రభుత్వానికి లేఖ రాశారు.
