
- జూనియర్ పంచాయతీ కార్యదర్శుల
- జేపీఎస్‌ల పనితీరు అంచనాకు ముగ్గురు అధికారులతో జిల్లా కమిటీ
హైదరాబాద్/కరీంనగర్, వెలుగు: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కఠిన రూల్స్ పెట్టింది. రెగ్యులరైజేషన్‌కు సంబంధించి శనివారం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. జేపీఎస్‌ల పనితీరును లెక్కగట్టేందుకు జిల్లా స్థాయిలో ముగ్గురు అధికారులతో డిస్ట్రిక్ట్ లెవల్ పెర్ఫామెన్స్ ఎవాల్యుయేషన్ కమిటీ (డీఎల్ పీఈసీ)ని ఏర్పాటు చేసింది. వాళ్లను రెగ్యులర్ చేసేందుకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో వివరిస్తూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ జిల్లా కమిటీలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) నోడల్ ఆఫీసర్ గా.. ఎస్పీ లేదా డీఎస్పీ, డీఎఫ్ వో (డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్) సభ్యులుగా ఉంటారు. కమిటీ తప్పనిసరిగా గ్రామానికి వెళ్లి సర్కార్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా సెక్రటరీ పనితీరును అంచనా వేయాల్సి ఉంటుంది. అంతేగాక వరుసగా నాలుగేండ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న సెక్రటరీల పనితీరును అంచనా వేస్తారు. తనిఖీలు పూర్తయ్యాక తమ రిపోర్టుపై ముగ్గురు ఆఫీసర్లు సంతకాలు చేసి, కలెక్టర్ కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రిపోర్టులను స్కాన్ చేసి పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో సంబంధిత అడిషనల్ కలెక్టర్ అప్ లోడ్ చేయాలి. చివరగా ఈ రిపోర్టులను ఆయా జిల్లాల కలెక్టర్లు స్క్రూటినీ చేసి జేపీఎస్ ల రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ప్రపోజల్స్ ను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కు పంపిస్తారు.
8 పారామీటర్ల ఆధారంగా అసెస్ మెంట్..
జేపీఎస్ ల పనితీరును అంచనా వేసేందుకు ప్రభుత్వం ఒక ఫార్మాట్ ను విడుదల చేసింది. ఇందులో 8 పారామీటర్స్ కింద 23 రకాల పనులను చేర్చారు. వీటి ఆధారంగా 100 మార్కులతో సెక్రటరీల పనితీరు అంచనా వేయనున్నారు. గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ (35 మార్కులు), 100 శాతం ఇంటిపన్ను వసూలు (10 మార్కులు), నర్సరీ నిర్వహణ (10), మొక్కల సంరక్షణ (10), ఎలక్ట్రిసిటీ బిల్ – ట్రాక్టర్ ఈఎంఐ చెల్లింపు (10), 10 శాతం గ్రీన్ బడ్జెట్ వినియోగం(5), చెత్త సేకరణ(15), బర్త్, డెత్ రికార్డుల నిర్వహణ(5) అనే పారామీటర్ల ఆధారంగా అసెస్ మెంట్ చేయనున్నారు. అయితే ఎన్ని మార్కులు వస్తే రెగ్యులరైజ్ చేస్తారనేది క్లారిటీ లేదు. జిల్లా కమిటీ నిర్దేశించిన లక్ష్యాల్లో మూడింట రెండొంతులు చేరుకున్నోళ్లను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ చెప్పారు.
డీపీఓలకు నో క్లారిటీ..
ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌పై తమకు సమాచారం లేదని జిల్లా పంచాయతీ ఆఫీసర్లుఅంటున్నారని సెక్రటరీలు చెబుతున్నారు. ఇటీవల సీఎం ప్రకటన నాటి నుంచి క్లారిటీ కోసం డీపీవోల దగ్గరకు సెక్రటరీలు నిత్యం వెళ్తున్నారు. జేపీఎస్ లు, ఔట్ సోర్సింగ్, నాన్ లోకల్, ట్రైబల్ ప్రాంతాల వాళ్లు.. ఇలా చాలా రకాలుగా ఉన్నారని, వీరిలో ఎవరిని రెగ్యులర్ చేస్తారో చెప్పాలని డీపీవోలను కోరుతున్నారు. ఈ ప్రాసెస్ అడిషనల్ కలెక్టర్లు చూస్తున్నారని వాళ్లు సమాధానమిస్తున్నారు. గతంలో జిల్లాలో పంచాయతీ రాజ్ కు డీపీవో ఉండగా వాళ్లు కలెక్టర్ కు రిపోర్ట్ చేస్తుండేవారు.
శాంక్షన్డ్ పోస్టులు 9,355
ప్రభుత్వం మొత్తం 9,355 పోస్టులను భర్తీ చేయగా, ప్రస్తుతం 8 వేల మంది జేపీఎస్ లు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 6,600 మంది సెక్రటరీ పోస్టులను మాత్రమే క్యాడర్ స్ర్టెంత్ గా పంచాయతీ రాజ్ లో ఖరారు చేసినట్లుగా అసెంబ్లీలో వెల్లడించిన రిపోర్ట్ లో ఉంది. మిగతా వాళ్లు ఔట్ సోర్సింగ్ (1,100 మంది), నాన్ లోకల్ కోటా లో ఎంపికైన వారు, ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు.. ఇలా పలు రకాలుగా ఉన్నారు. అయితే 2019 ఏప్రిల్ నుంచి పని చేస్తూ నాలుగేండ్ల సర్వీస్ ఉన్నవాళ్లు 6 వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాబ్ లు రిజైన్ చేసిన వారి ప్లేస్ లో నాన్ లోకల్ కోటా.. రెండు, మూడో మెరిట్ లిస్ట్ లో సెలక్ట్ అయిన వాళ్లు, ఔట్ సోర్సింగ్ సెక్రటరీల( ఓపీఎస్) పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై సెక్రటరీలు ప్రశ్నిస్తే, అధికారులు తమకేం తెల్వదని అంటున్నారు.
రూల్స్ మార్చాలె..
మేం పరీక్ష రాసి సెలెక్ట్ అయినంక, ఇప్పుడు పనితీరు లెక్కగట్టడం ఏందో అర్థమైతలేదు. నాలుగేండ్ల ప్రొబేషన్ పెట్టారు. ఇప్పుడు రెగ్యులరైజేషన్ కు కఠిన నిబంధనలు పెట్టారు. ఏ గ్రామ పంచాయతీలోనూ 100 శాతం హౌస్ ట్యాక్స్ కట్టలేదు. దీనికి 10 మార్కులు ఉన్నాయి. ట్రాక్టర్ ఈఎంఐ, కరెంట్ బిల్లులు పంచాయతీల పైసలు ఉంటేనే కడతరు. వీటికి సెక్రటరీకి ఏం సంబంధం? రెవెన్యూ వాళ్లు స్థలాలు ఇయ్యక చాలాచోట్ల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయలేదు.
- వరంగల్‌కు చెందిన ఓ జేపీఎస్ ఆవేదన
60 అంశాలతో సెక్రటరీల ప్రొఫైల్..
60 అంశాలతో కూడిన ఫార్మాట్ ను సెక్రటరీలు నింపి ఇవ్వాలని అధికారులు గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. జాయినింగ్ డేట్, తీసుకున్న లీవ్ లు, వర్కింగ్ డేస్, జీతం, అధికారులు ఇచ్చిన మోమోలు, షోకాజ్ నోటీసులు, డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, గ్రామసభలు, తడి, పొడి చెత్త నిర్వహణ, నాటిని మొక్కలు.. అందులో బతికినవి ఎన్ని? చనిపోయినవి ఎన్ని?, ట్రాక్టర్ లోన్లు, కరెంట్ బిల్లులు, బర్త్, డెత్ ల నమోదు, గ్రీన్ బడ్జెట్.. ఇలా 60 అంశాలు ఉన్న రిపోర్ట్ ను ఫిల్ చేసి జిల్లా అధికారులకు సెక్రటరీలు అందజేయాల్సి ఉంటుంది.