
హైదరాబాద్: ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇందులో భాగంగా విచారణకు రావాలంటూ నిందితులకు నోటీసులు జారీ చేసింది ఈడీ. నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మీకి సోమవారం (జూలై 21) ఈడీ సమన్లు పంపింది. ఒక్కొరిని ఒక్కో తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈడీ. 2025, జులై 23న దగ్గుబాటి రానా.. 2025, జూలై30న ప్రకాష్ రాజ్.. 2025, ఆగస్ట్6న విజయ్ దేవరకొండ.. 2025, ఆగస్ట్ 13న మంచు లక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించింది.
కాగా, ప్రభుత్వం నిషేధించిన ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ఆరోపణలపై హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీలపై గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది.
పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను విచారించాలని ఈడీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే నిందితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి స్టార్ యాక్టర్లకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఈ కేసులో ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.