మళ్లీ మొదలైన మైక్రో ఫైనాన్స్ దందా .. గ్రామాల్లో గ్రూపుల వారీగా రుణాలు మంజూరు

మళ్లీ మొదలైన  మైక్రో ఫైనాన్స్ దందా .. గ్రామాల్లో గ్రూపుల వారీగా రుణాలు మంజూరు
  • వారం, పక్షం రోజులకోసారి కిస్తీల వసూళ్లు
  • ఆలస్యమైతే ఒత్తిళ్లు.. భారీ జరిమానాలు
  • మరోవైపు పెరుగుతున్న మార్టగేజ్ లోన్లు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో మైక్రో ఫైనాన్స్ దందా మళ్లీ మొదలైంది. కొంత కాలంగా పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని గ్రూపుల వారీగా రుణాలు ఇస్తూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. 5 నుంచి 10 మంది మహిళలు, పురుషులతో గ్రూపులను ఏర్పాటు చేసి వారికి రూ.2 నుంచి 5 లక్షల వరకు షూరిటీ లేకుండా రుణాలను ఇస్తున్నారు. ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ పేరిట రూ.5 నుంచి 6 వేలు వసూలుచేస్తున్నారు. 

ఈ గ్రూపుల్లోని ఇద్దరిని లీడర్, సెకండ్ లీడర్లుగా ఎంపిక చేసి వారం, పక్షం, నెల రోజులకు ఒకసారి కిస్తీలను వసూలు చేస్తున్నారు. ఒక్క రోజు ఆలస్యమైనా రూ.50 జరిమానా వసూలు చేస్తున్నారు. ఒకవేళ రుణాల కిస్తీలు సకాలంలో కట్టకపోతే గ్రూపు సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ముందస్తుగా నిర్ణయించిన తేదీ లేదా నిర్ణీత వారం మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లు గ్రామానికి చేరుకోగానే లీడర్లు కిస్తీ డబ్బులు వసూలు చేసి వారికి అందించాలి. 

పుట్టగొడుగుల్లా ఆఫీసులు

సిద్దిపేట జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో పుట్టగొడుగుల్లా మైక్రో ఫైనాన్స్ ఆఫీసులు వెలుస్తున్నాయి. సిద్దిపేటలోనే దాదాపు 80 వరకు మైక్రో ఫైనాన్స్ ఆఫీసులు కొనసాగుతున్నట్లు సమాచారం. బెజ్జంకి, హుస్నాబాద్, చేర్యాల, చిన్నకోడూరు, జగదేవ్ పూర్, గజ్వేల్ తో పాటు కరీనంగర్ జిల్లా గన్నేరు వరం, మానకొండూరులో ఆఫీసులు  ఏర్పాటు చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా  తమ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల కింద చిన్న కోడూరు మండలం మాచాపూర్ లో ఓ వ్యక్తి  మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినా వదిలిపెట్టలేదు. ఇలాంటి సంఘటనలు గ్రామాల్లో జరుగుతున్నా పరువు పోతుందనే భయంతో ఎవరు బయటకు చెప్పుకోవడం లేదు. పరువు కోసం కొందరు ఆస్తులు, నగలను అమ్ముకుని మైక్రో ఫైనాన్స్ రుణాలను గుట్టు చప్పుడు కాకుండా చెల్లిస్తున్నారు.  

భారీగా మార్టగేజ్ లోన్లు

మల్లన్నసాగర్, కొండ పొచమ్మ సాగర్ నిర్వాసితులుండే ఆర్అండ్ ఆర్ కాలనీల్లో మార్టగేజ్ రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉపాధి కరువై, వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేకపోవడంతో నిర్వాసితులు ఆర్థిక అవసరాల కోసం తమ ప్లాట్లను కుదువ పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో ఒక్కో  ప్లాట్ రూ.5 నుంచి రూ.15 లక్షలకు మార్టేగేజ్ చేసుకుని రుణాలు ఇస్తున్నారు. జిల్లాలో దాదాపు 700 పై చిలుకు ఫైనాన్స్ లు నడుస్తుండగా వాటిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్నవే ఎక్కువగా ఉన్నాయి. వీరందరూ వందకు మూడు నుంచి ఏడు రూపాయల వడ్డీని వసూలు చేస్తున్నారు. రెండేళ్ల కింద జిల్లాలో అక్రమ ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులు దాడులు జరిపి కేసులు నమోదు చేయగా కొద్ది కాలం పాటు వీరి కార్యకలాపాలు తగ్గినా ఇటీవల మళ్లీ పెరిగాయి.