మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి/పాపన్నపేట, వెలుగు: పోషకాహారం రాజకీయ పథకం కాదని అది రాజ్యంగ హక్కు అని ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మెదక్కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంగన్ వాడీ సెంటర్ లో పిల్లలకు ఇస్తున్న గుడ్డు సైజ్ చిన్నగా ఉంటోందని, అంత్యోదయ కార్డు కలిగిన వారికి చక్కెర ఇవ్వడం లేదని, తూకంలో తేడాలు ఉంటున్నాయని, ఎంఎల్ఎస్ పాయింట్లలో సిబ్బంది పనితీరు సరిగా ఉండడం లేదనే ఫిర్యాదులు అందాయన్నారు.
అక్షయ పాత్ర ద్వారా స్కూళ్లకు సరఫరా అవుతున్న అన్నం చల్లారి పోయి, గడ్డలుగా ఉంటుందనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులు ఈ లోపాలు సరిదిద్దాలన్నారు. స్కూల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి రేషన్ షాప్, అంగన్ వాడీ సెంటర్, స్కూళ్లలో ఫిర్యాదుల పెట్టె, సంబంధిత అధికారుల హోదా, ఫోన్ నంబర్ రాసి ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మెదక్ పట్టణంలోని చర్చిని సందర్శించి ప్రార్థనలు చేశారు.
