పాపం పిల్లలు.. చదువుకుంటూనే చనిపోయారు: బంగ్లా విమాన ప్రమాదంలో 19కి చేరిన మృతుల సంఖ్య

పాపం పిల్లలు.. చదువుకుంటూనే చనిపోయారు: బంగ్లా విమాన ప్రమాదంలో 19కి చేరిన మృతుల సంఖ్య

ఢాకా: భారత పొరుగు దేశం బంగ్లాదేశ్‎లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఫ్లైట్ క్రాష్‎లో చనిపోయిన వారి సంఖ్య 19కి చేరింది. మరో 70 గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు చనిపోయిన 19 మందిలో చాలా మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చదువుకోవడానికి స్కూల్‎కు వెళ్లి ఊహించని విపత్తులో తమ పిల్లలు చనిపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆసుపత్రి మార్చురీల వద్ద పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించిన తీరు అక్కడున్న వారందరిని కంటతడి పెట్టించింది.  

కాగా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సిటీ నార్త్ ఏరియాలో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ ఉంది. ఇది చాలా పెద్ద క్యాంపస్. ఇక్కడ వందల మంది స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. 2025, జూలై 21వ తేదీ మధ్యహ్నం ఒంటి గంట 30 నిమిషాల సమయంలో.. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‎కు చెందిన పైలెట్ శిక్షణ విమానం జెట్ F- 7BJI.. ఒక్కసారిగా కాలేజీ క్యాంపస్‎లోకి దూసుకొచ్చింది. 10 అంతస్తులు కాలేజీ బిల్డింగ్ మూడో అంతస్తును ఢీకొట్టి.. కూలిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చి పేలిపోయింది.

ఈ ఘటనలో స్పాట్‎లోనే ఒకరు చనిపోయినట్లు కాలేజీ సిబ్బంది వెల్లడించారు. చాలా మంది గాయపడ్డారని.. వాళ్లను ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు అధికారులు. ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈ జెట్ విమానం.. మధ్యాహ్నం ఒంటి గంట 6 నిమిషాలకు టేకాఫ్ అయ్యింది. 24 నిమిషాలు గాల్లో తిరిగిన తర్వాత.. ఢాకా సిటీకి ఉత్తరం వైపున ఉన్న కాలేజీ క్యాంపస్‎లోని బిల్డింగ్‎ను ఢీకొట్టి.. పేలిపోయినట్లు ఎయిర్ పోర్ట్ సీనియర్ అధికారి ప్రకటించారు.

ఈ విషాద ఘటనపై బంగ్లాదేశ్ తాత్కలిక ప్రధాని మహమ్మద్ యూనస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు అన్ని రకాల సహయం అందించాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఈ ఘటన దేశానికి తీవ్ర దుఃఖం కలిగించే క్షణమని అభివర్ణించారు. మృతులకు నివాళిగా మంగళవారం (జూలై 22) జాతీయ సంతాప దినంగా ప్రకటించామని తెలిపారు.