
జీవో 49ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. కొమురంభీం కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం జీవో 49ను విడుదల చేసింది ప్రభుత్వం. ఆదివాసీల అనుమానాలు, ఆందోళనలతో జీవో 49 నిలిపివేసింది. ఈ మేరకు జీవోను నిలిపి వేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో సచివాలయంలో మంత్రి సీతక్క, ఆదివాసీలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల పక్షాణ ఉంటుందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు.
జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటిస్తూ మే 30న జీఓ 49ను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ఆదివాసీ గిరిజనులు నెల రోజులుగా కదం తొక్కారు. ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జీవో .49 తో ఆదివాసీలను అడవుల నుంచి తరిమేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టైగర్ జోన్ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆదివాసీ గిరిజనులకు మేలు చేస్తామని పెట్టారని, ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.
జీవో 49ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జులై 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు.