
హైదరాబాద్: వర్షం పడితే హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం (జూలై 21) వర్షాలు, వైరల్ ఫీవర్స్, పంటల సాగు, ఎరువులు, రేషన్ కార్డుల పంపిణీ పురోగతిపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అన్ని హాస్పిటల్స్ లో వైరల్ ఫీవర్స్ మెడిసిన్స్ అందుబాటులో ఉండాలన్నారు.
గవర్నమెంట్ ఆసుపత్రలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. హైదరాబాద్లో వర్షాలు ఎక్కువ పడితే అధికారులు అలర్ట్గా ఉండాలని, వాటర్ లాగింగ్ పాయింట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పారు. వర్షాలకు సంబంధించిన సమాచారం ముందే తెలుసుకుని అప్రమ్తంగా ఉండాలని సూచించారు. ట్రై సిటీ కమిషనర్లతో హైదరాబాద్ కలెక్టర్ కో ఆర్డినేట్ చేసుకోవాలన్నారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు సిటీ కమిషనర్లు కూడా గ్రౌండ్ పర్యవేక్షించాలని చెప్పారు.
జిల్లాల్లో పిడుగు పాటు మరణాలు ఎక్కువ అయ్యాయని.. పిడుగులకు సంబంధించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. పిడుగు పాటు మరణాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆర్థిక సహయం అందించాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోని ఐఏఎస్ అధికారులు గ్రౌండ్లో పని చేయాల్సిందేనని.. కలెక్టర్ల కార్యచరణ రిపోర్టు రోజు తనకు పంపాలని ఆదేశించారు.