
- ఢిల్లీ వెళ్లిన బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
- జేపీ నడ్డాతో బండి, ఈటల ఇష్యూ పై చర్చించే చాన్స్
- సోషల్ మీడియా పోస్టులు, నేతల వ్యాఖ్యలను పార్టీ అధినాయకత్వం ముందుంచనున్న బీజేపీ స్టేట్ చీఫ్
- అంతర్గత విషయాలు ఎవరూ మాట్లాడొద్దని గతంలోనే చెప్పిన బీజేపీ జాతీయ నాయకత్వం
- నేతలపై క్రమశిక్షణా చర్యలుంటాయా..?
- ఇద్దరికి సర్ది చెప్పి సయోధ్య కుదుర్చుతారా?
- ఆసక్తికరంగా మారిన కాషాయ పార్టీ పరిణామాలు
హైదరాబాద్: కమలం పంచాది హస్తనకు చేరింది. ఇద్దరు కీలక నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఢిల్లీ విమానం ఎక్కడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మల్కజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య అంతర్గతంగా రగులుతున్న వివాదం రచ్చకెక్కింది. ఇద్దరి నేతల మధ్య విమర్శలు, కౌంటర్ల దాకా వెళ్లింది. అంతకు ముందే అంతర్గత విషయాలను పార్టీ నేతలెవరూ చర్చించవద్దంటూ జాతీయ నాయకత్వం కీలక ప్రకటన చేసింది. అయినా అటు కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఇటు ఈటల రాజేందర్ ఓపెన్ గానే విమర్శలు చేసుకోవడం గమనార్హం. తనపై కావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని ఈటల ఆరోపిస్తుండగా.. పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యం ఉంటుందని, నేతల కోసం, వర్గాల కోసం పనిచేసే వారికి టికెట్లు దక్కవంటూ బండి సంజయ్ ప్రకటన చేశారు. బీజేపీ లైన్ కు విరుద్ధంగా వ్యవహరించిన ఈ నేతలపై చర్యలు తీసుకుంటారా..? లేదా ..? సర్ది చెప్పి సయోధ్య కుదుర్చుతారా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
స్టేట్ చీఫ్ హోదాలో తొలిసారి
స్టేట్ చీఫ్ హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్లిన రాంచందర్ రావు బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలువనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అధినాయకత్వానికి వివరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో బండి సంజ య్, ఈటల రాజేందర్ మధ్య తలెత్తిన వివాదాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. సోషల్ మీడియా పోస్టులు నేతలు చేసిన కామెంట్లను అధినాయకత్వం ముందుంచనున్నారని సమాచారం.
అలా గీత దాటేస్తుండ్రు
అంతర్గత విషయాలను బయటమాట్లాడొద్దని ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు సూచించింది. అయినా ఎవరూ ఆగడం లేదు. రాజాసింగ్ కొంత కాలంపాటు రాష్ట్ర నేతలపై వ్యాఖ్యలు చేశారు. తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకే దారి తీశాయి. పార్టీ నాయకులు ఎలా ఉండాలో చెప్పేశారు. రాజకీయాల్లో బురద అంటించుకోవాల్సిందేనని అన్నారు. ఆ తర్వాత బీజేపీ నాయకురాలు మాధవీలత కూడా గోషామహల్ నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. దీనిపైనా పార్టీ నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకొంటున్న పార్టీలో నేతలు గీత దాటుతుండటం హాట్ టాపిక్ గా మారింది.