తిరుమలలో స్వదేశీ ఆవు పాలనే వినియోగించాలి.. పిటిషనర్ వాదనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుమలలో స్వదేశీ ఆవు పాలనే వినియోగించాలి.. పిటిషనర్ వాదనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుమలలో స్వదేశీ ఆవు పాలనే వినియోగించాలనే పటిషన్ ను సోమవారం (జులై 21) సుప్రీం కోర్టు తిరస్కరించింది. తిరుమల దేవస్థానంలో స్వదేశీ ఆవు పాలను మాత్రమే వినియోగించేలా టీటీడీని ఆదేశించాలని వేసిన పిటిషన్ తిరస్కరించిన కోర్టు.. టీటీడీని ఆవిధంగా ఆదేశించలమేమని తేల్చి చెప్పింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ లతో కూడిన బెంచ్.. పిటిషనర్ కావాలంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ సందర్భంగా ఉన్నత ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 

వాదనల సందర్భంగా.. ఆవు అంటే ఆవే.  దేవుడిపైన నిజమైన భక్తి చూపించడమంటే సాటి మనుషులకు సాయం చేయడం, ఇతర జీవులను మానవతా హృదయంతో చూడటమే కానీ.. ఇలాంటి అంశాలను లేవనెత్తడం కాదని.. సమాజంలో విచారించేందుకు ఎన్నో విషయాలు ఉన్నాయని.. ధర్మాసనం పేర్కొంది. 

దేశీ ఆవుల పాలను వినియోగించడమే ఆనవాయితీగా ఆగమ శాస్త్రాల్లో ఉందని పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదించారు. ఆచారాలు అనేవి శాస్త్రాల ఆధారంగా నిర్వహించాలని.. అందుకోసం టీటీడీని ఆదేశించాల్సిందిగా పిటిషనర్ కోరుతున్నట్లు చెప్పారు. దీనిపై జస్టిస్ సుందరేశ్ స్పందిస్తూ.. ఆచారాలు, విభజనలు అనేవి మనుషులు ఏర్పాటు చేసుకున్నవేనని.. భాష, కులం, వర్గం, రాష్ట్రాల ఆధారంగా విభజనలు, ఆచారాలు మారిపోతాయని.. అవి దేవుడు ఏర్పాటు చేసినవి కావని పేర్కొన్నారు. దేవుడు అందరికీ సమానం.. మనుషులతో పాటు అన్ని జీవులను సమానంగా చూస్తాడు.. దేశీ ఆవుల పాలే కావాలని దేవుడు అడగడు.. ఆయన కోరేది వేరే ఉంటుంది.. అవునా కాదా.. అని ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా.. ఏదైనా లీగల్ ఆర్డర్ ఉంటే ప్రవేశపెట్టాలని బెంచ్ అడిగింది. దీనికి రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయాన్ని ఉటంకిస్తూ.. కనీసం ఈ అంశంలో టీటీడీ అభిప్రాయాన్ని అడగాల్సిందిగా పిటిషనర్ కోరారు. దీనిపై స్పందిచిన న్యాయమూర్తి.. ఇప్పుడు తిరుపతి లడ్డూ కూడా స్వదేశీగానే ఉండాలని చెప్పగలమా.. అని ప్రశ్నించారు. ఈ అంశంలో పిటిషనర్ హైకోర్టుకు స్వేచ్ఛగా వెళ్లవచ్చునని.. హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చునని సూచించింది.