పోస్టాఫీస్ల్లో స్మార్ట్ సేవలు.. యూపీఐ పేమెంట్స్ కోసం ‘డాక్ పే’ యాప్

పోస్టాఫీస్ల్లో స్మార్ట్ సేవలు.. యూపీఐ పేమెంట్స్ కోసం ‘డాక్ పే’ యాప్
  • పోస్టాఫీస్ల్లో స్మార్ట్ సేవలు.. ఇండియన్ పోస్ట్ 2.0 డిజిటల్ వెర్షన్ అప్ డేట్
  • యూపీఐ పేమెంట్స్ కోసం ‘డాక్ పే’ యాప్ 
  • స్పీడ్గా సేవలు అందేలా సాఫ్ట్ వేర్లోనూ మార్పులు
  • ఇయ్యాల నో ట్రాన్సాక్షన్ డే
  • రేపటి నుంచి అందుబాటులోకి స్మార్ట్ సేవలు

హనుమకొండ, వెలుగు: ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సేవలు మరింత డిజిటల్ కానున్నాయి. ఇప్పటికే పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తో పాటు మరికొన్ని సేవలను డిజిటల్ గా అందిస్తోంది. గతంలోని అన్ని సేవలను అప్ డేట్ చేస్తూ 2.0 వెర్షన్ గా రూపొందించింది.  ముఖ్యంగా డిజిటల్ సేవల్లో యూపీఐ చెల్లింపులకు ‘డాక్ పే’యాప్ ను అందుబాటులోకి తెస్తోంది. రేపు అధికారికంగా లాంచ్ చేస్తుండగా.. ఆగస్టు నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని పోస్టల్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు.

కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్ 
పోస్టాఫీసు హెడ్, సబ్, బ్రాంచ్ ల్లో స్టాంప్స్ అమ్మడం, స్పీడ్ పోస్ట్, పార్శిల్ సేవలతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పోస్ట్ ఆఫీసులే మినీ బ్యాంకులుగా పని చేస్తున్నాయి. కానీ, ఇప్పటివరకు చాలావరకు ఆఫ్ లైన్ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా, 2.0 వెర్షన్ లో భాగంగా ప్రధానంగా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్ చేస్తున్నారు. ఇందులో సేవింగ్స్ అకౌంట్స్, వివిధ రకాల డిపాజిట్ సేవలను మరింత సులభతరం చేస్తున్నారు. అంతేగాకుండా గతంలో పోస్టాఫీస్ నుంచి ఏదైనా పార్సిల్ పంపిస్తే అది రీచ్ అయ్యిందో లేదో తెలుసుకునే వెసులుబాటు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు స్పీడ్ పోస్ట్, పార్శిల్స్, ఇతర లాజిస్టిక్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే చాన్స్ కూడా ఉంటుంది. కస్టమర్ కంప్లైంట్స్, ఫీడ్‌ బ్యాక్ కూడా మెరుగ్గా నిర్వహించడంతో పాటు సేవలను స్పీడ్ గా అందించేలా ఐటీ 2.0 వెర్షన్  పని చేయనుందని పోస్టల్ అధికారులు  పేర్కొంటున్నారు. 

‘డాక్ పే’తో డిజిటల్ పేమెంట్స్
పోస్టాఫీసులు మినీ బ్యాంకులుగా సేవలందిస్తున్నా.. ఎక్కడ కూడా డిజిటల్ చెల్లింపులకు చాన్స్ లేదు. దీంతో ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే వంటి ప్రైవేట్ యాప్స్ ను మాత్రమే వినియోగిస్తున్నారు. కాగా, డిజిటల్ ఇండియాలో భాగంగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ యూపీఐ పేమెంట్స్ కు 'డాక్ పే' యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. క్యూ ఆర్ కోడ్ తో పాటు అన్నిరకాల యూపీఐ పేమెంట్స్ చేసే చాన్స్ ఉంటుంది. ఈ విధానాన్ని కర్నాటకలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. అక్కడ సక్సెస్ కావడంతో దేశమంతటా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 'డాక్ పే' యాప్  ఇంటర్నెట్ లేని సమయంలో పేమెంట్​చేసినా.. నెట్ కనెక్షన్ రాగానే పేమెంట్ పూర్తయ్యే ఫీచర్ ఉండటం విశేషం.

రేపటి నుంచి అమలులోకి.. 
ఇప్పటికే ఇండియన్ పోస్ట్ లో 2.0 సాఫ్ట్ వేర్ రెడీ కాగా.. దానిని రేపటి నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు డిజిటల్ పేమెంట్స్ యాప్ ను కూడా లాంచ్ చేయనున్నారు. అయితే.. ఈ సేవలు ఆగస్టు నుంచి విస్తృతంగా అందుబాటులోకి రానున్నట్లు పోస్టల్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ అప్ డేట్  పనులన్నీ పూర్తి అయ్యాయి. కాగా.. సోమవారం సాఫ్ట్ వేర్ ను అమలులోకి తీసుకొచ్చిన తర్వాత టెక్నికల్ ప్రక్రియలో భాగంగా నాన్ ట్రాన్సాక్షన్స్ డే గా ప్రకటించారు. ఈ రోజు ఎలాంటి లావాదేవీలు చేయొద్దని పోస్టల్ అధికారులు వినియోగదారులకు సూచిస్తున్నారు. మరుసటి రోజు నుంచి చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.

వేగవంతమైన సేవల కోసమే..
ఉమ్మడి జిల్లాలో 800కుపైగా పోస్టాఫీసులు ఉండగా, వినియోగదారులకు స్పీడ్ గా సేవలందిం చేందుకే  2.0 సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం వస్తుండగా వినియోగదారులకు మరింత మెరుగ్గా సేవలు అందుతాయి.  సాఫ్ట్ వేర్ అప్డేట్ కారణంగా సోమవారం  వినియోగదారులు ట్రాన్సాక్షన్స్ చేయొద్దు. మరుసటి రోజు నుంచి  పోస్టల్ డిజిటల్ సేవలను స్పీడ్ గా వినియోగించుకోవచ్చు.


వి.హనుమంతు, పోస్టల్ సూపరింటెండెంట్, హనుమకొండ