- ఉద్యోగులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) పరిధిలోని వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో 12 వెల్‌నెస్ కేంద్రాల కార్యాచరణ, నిర్వహణ బాధ్యతలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), నిమ్స్ ఆసుపత్రికి ప్రభుత్వం బదిలీ చేసింది.
ఈ మేరకు కుటుంబ, ఆరోగ్య, సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ విజ్ఞప్తి మేరకు ఈ మార్పులు చేశామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులు, జర్నలిస్టులకు ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు మరింత విస్తృతం కానున్నాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్లను నిమ్స్ ఆసుపత్రికి అనుసంధానించారు.
మిగిలిన కేంద్రాలైన ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, వరంగల్ సెంటర్ల బాధ్యతలను డీఎంఈకి అప్పగించారు. ఇకపై ఈ కేంద్రాల్లో గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ వంటి స్పెషలిస్ట్ వైద్యుల నియామకం, మందులు, పరికరాల కొనుగోలు వంటివి డీఎంఈ, నిమ్స్ పర్యవేక్షణలో జరుగుతాయి. పరిపాలన సిబ్బందిని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నియమించనుంది. ఈ కేంద్రాల నిర్వహణకు అయ్యే ఖర్చును ఈహెచ్ఎస్ బడ్జెట్ నుంచే భరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
