- 1.62 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
- ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలు
- ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- 70,804 మంది ఉద్యోగులకు ప్రయోజనం
- ప్రభుత్వంపై ఏటా రూ.9.35 కోట్ల అదనపు భారం
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యుత్ సౌధలోని జెన్ కో ప్రధాన కార్యాలయంలో బుధవారం ఇంధన శాఖ అధికారుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నిర్ణయం ప్రకటించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా డీఏను పెంచే ప్రతిపాదనకు సీఎం పచ్చ జెండా ఊపినట్టుగా తెలిపారు.
విద్యుత్ ఉద్యోగులకు 1.621 శాతం మేర డీఏను పెంచుతూ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనితో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651% నుంచి 19.272% కి పెరిగింది. ఈ డీఏ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ. 9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. విద్యుత్ రంగ సంస్థల్లో పని చేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు ఈ డీఏ పెంపు వల్ల ప్రయోజనం పొందనున్నారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రాబోయే దశాబ్ద కాలానికి సమగ్రమైన, దీర్ఘకాలిక విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. రాబోయే పదేండ్లలో రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను విస్తరించాలని అన్నారు. రాష్ట్రంలో 2035-–36 నాటికి పీక్ డిమాండ్ 34,137 మెగావాట్లకు చేరుకుంటుందని ఇంజినీర్లు అంచనా వేసి చెప్పారు. ఈ ఏడాది నమోదైన పీక్ డిమాండ్ 18,548 మెగావాట్లకు దాదాపు రెట్టింపుగా ఉంటుందని అన్నారు.
అంతేకాకుండా 2035-–36 నాటికి వార్షిక విద్యుత్ అవసరాలు 1,52,626 మిలియన్ యూనిట్లకు (ఎంయు) చేరుకుంటుందన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్ కో అత్యంత సంసిద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు సూంచించారు. ప్రధానంగా క్షేత్రస్థాయి అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే, తక్షణమే రంగంలోకి దిగి లోపాలను సరిచేయాలని ఆదేశించారు.
ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా సంభవించే విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్ కో సీఎండీ హరీశ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్, ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ సంపత్ కుమార్, ట్రాన్స్ కో ప్రాజెక్ట్స్ డైరెక్టర్ లతా వినోద్, ఇతర విద్యుత్ సంస్థల అధికారులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం సమీక్ష
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం విద్యుత్ రంగంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష జరిపారు. ప్రధానంగా రాబోయో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విద్యుత్ అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించారు. రానున్న పదేండ్లను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ రంగ సంస్థల్లో మౌలిక సదుపాయాల కోసం పటిష్టమైన ప్రణాళికను రూపొందించడంపై ఆయన అధికారులుకు పలు సూచనలు చేశారు. ఈ ఏడాది మార్చి 27న పీక్ డిమాండ్ 18,548 మెగావాట్లకు చేరిందని విద్యుత్ శాఖ ఇంజినీర్లు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
అయినా సరఫరాలో అంతరయాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు, సిబ్బంది పని చేశారని భట్టి ఉద్యోగులను అభినందించారు. ఈ ఏడాది మార్చి 13న అత్యధికంగా 341 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైనా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
