- వ్యవసాయ కార్మిక, సంగర్చ్ మోర్చా అఖిల భారత వేదిక పిలుపు
- ఆగస్ట్ 10 న జైలు బరో కార్యక్రమం
- ఉపాధి హామీనే పునరుద్దరించాలని డిమాండ్
- కేంద్ర అరకోర కేటాయింపులతో తెలంగాణపై మరింత ఆర్థిక భారం
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్ వీబీ జీరాంజీ)' కి వ్యతిరేకంగా జూలై 1 నుంచి దేశవ్యాప్త ఆందోళనలకు వ్యవసాయ కార్మిక, సంఘర్ష్ మోర్చా అఖిల భారత వేదిక పిలుపునిచ్చింది. ఈ కొత్త స్కీం స్థానంలో గతంలోని 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(మహాత్మా గాంధీ ఎన్‌ఆర్‌ఈజీఏ)' ను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. లేకుంటే ఆగస్టు 10న 'జైల్ భరో' కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించింది.
ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) లో అఖిల భారత సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీటింగ్ అనంతరం ఏఐఏడబ్ల్యూయూ జనరల్ సెక్రటరీ బి. వెంకట్, నిఖిల్ దేవ్, గోరియా, ముఖేశ్ తదితర నేతలు సమావేశ వివరాలను వెల్లడించారు.
ఉపాధిని నాశనం చేసేలా డ్రాఫ్ట్ రూల్స్
వీబీ జీరాంజీ స్కీం అమలు కోసం తెచ్చిన డ్రాఫ్ట్ రూల్స్ ఉపాధినే నాశనం చేసేలా ఉన్నాయని నేతలు విమర్శించారు. 55 క్లాజులు (పాయింట్లు), వందలాది సబ్ పాయింట్లతో విడుదల చేసిన డ్రాఫ్ట్ రూల్స్ అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని మండిపడ్డారు. మొత్తం అధికారాలన్ని స్టీరింగ్ కమిటీకే కట్ట బెట్టారని, ఆ కమిటీలోనూ పూర్తిగా అధికారులే ఉన్నారని తెలిపారు. అలాగే, కౌన్సిల్‌కు ప్రతిపాదించిన రూల్స్ చూస్తే... అక్కడ పని ఉండదని, అధికారాలూ ఉండవని పేర్కొన్నారు. బడ్జెట్ స్టీరింగ్ కమిటీ ఎంత చెబితే కేంద్ర ప్రభుత్వం అంత మొత్తమే విడుదల చేస్తుందన్నారు. ఈ నిబంధనల వల్ల ఉపాధి కార్మికులే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిధుల కోసం కేంద్రం ముందు భిక్షాటన చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సర్కారుపై మరింత భారం
ఈ కొత్త స్కీం కింద తెలంగాణకు కేంద్రం చేసిన కేటాయింపులు ఏమాత్రం సరిపోవని నేతలు స్పష్టం చేశారు. కేంద్రం దాదాపు రూ. 3,825 కోట్లు కేటాయించిందని, దీనికి అదనంగా 40 శాతం రాష్ట్ర వాటా కింద మరో రూ. 2,550 కోట్లు కలిపితే... మొత్తం సుమారు రూ. 6,375 కోట్లు అవుతుందని లెక్కగట్టారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం 30.99 లక్షల మంది ఈ పథకం కింద పని చేస్తున్నారని చెప్పారు. వీరందరికీ 125 రోజుల పనిదినాలు కల్పించాలంటే రూ. 12,819 కోట్లు అవసరమవుతాయని వివరించారు.
మరి తాజా కేటాయింపులతో రాష్ట్రంలో కార్మికులకు ఉపాధి కల్పించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేంద్రం అదనంగా ఒక్క పైసా ఇవ్వకపోతే... తెలంగాణ ప్రభుత్వంపై మరో రూ. 6,445 కోట్ల భారం పడుతుందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదనంగా దాదాపు రూ. 15,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
