ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు మెడికల్ స్కీం : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా  జర్నలిస్టులకు మెడికల్ స్కీం :  తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

అబిడ్స్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వర్కింగ్ జర్నలిస్టులకు మెడికల్ స్కీం వర్తించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ చాపెల్ రోడ్డులోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో ఇటీవల మరణించిన, ప్రమాదాలకు గురైన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం, పింఛన్​ చెక్కులను బుధవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. 

బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల పింఛన్​ అందిస్తున్నామని తెలిపారు. పదో తరగతి లోపు చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉంటే అదనంగా మరో రూ.2 వేల సహాయాన్ని అకాడమీ ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.