- 12 నియోజకవర్గాల్లో ఓటర్లు 30,53,238
- మ్యాపింగ్‌లో మహబూబాబాద్ టాప్,
- వరంగల్ తూర్పు, పశ్చిమ వెనుకబాటు
- ఇప్పటికే 30,687 ఓటర్ల తొలగింపు
జనగామ, వెలుగు :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో లక్షల సంఖ్యలో ఓట్లు మ్యాపింగ్ కాలేదు. 2002 ఓటరు లిస్ట్‌తో 2025 లిస్ట్‌ను మ్యాపింగ్ చేశారు. మ్యాపింగ్ కాని ఓటర్లు తగిన ఆధారాలు చూపించకుంటే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.
- 30,53,238 మంది ఓటర్లు..
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) 2002లో జరిగింది. ఈ 24 ఏండ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. 'సర్' నిర్వహణలో భాగంగా ముందస్తుగా 2002 ఓటరు జాబితాతో 2025 జాబితాను మ్యాపింగ్ చేశారు. 2025 ఓటరు జాబితా ప్రకారం ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 30,83,925 ఓటర్లు ఉన్నారు.
గడిచిన కొన్ని నెలలుగా నిర్వహిస్తున్న మ్యాపింగ్ ప్రక్రియలో చనిపోయిన వారి ఓట్లు, రెండు మూడు చోట్ల ఉన్న 30,687 ఓటర్లను ఇప్పటికే తొలగించారు. వీరు పోను ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 30,53,238 మంది ఓటర్లు ఉన్నారు.
- 83.76 శాతం మ్యాపింగ్..
మండలాల వారీగా నిర్వహించిన ఈ మ్యాపింగ్ ప్రకియలో 2002 లిస్ట్‌లోని ఓటర్ల పేర్లు, ఓటర్ ఐడీ, పోలింగ్ స్టేషన్ నెంబర్ ప్రకారం పోల్చి చూశారు. అప్పటి పేర్లు ప్రస్తుత జాబితాలో ఉన్నాయా..? లేవా..? అని పరిశీలించారు. 2002 జాబితాతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25,57,398 ఓటర్లు (83.76 శాతం) మ్యాపింగ్ అయ్యారు.
ఈ ప్రక్రియలో మహబూబాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 96.52 శాతం ఓటర్లు మ్యాపింగ్ కాగా, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 58.84 శాతం, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 67.83 శాతం ఓటర్లను మ్యాపింగ్ చేశారు. కాగా 7,65,088 మంది ఓటర్ల పేర్లల్లో తప్పులు ఉన్నాయి.
- మ్యాపింగ్ కాని ఓటర్లు 4,95,840..
2002 ఓటరు లిస్ట్‌తో 12 నియోజకవర్గాల్లోని 4,95,840 మంది ఓటర్లు మ్యాచింగ్ కాలేదు. ఎక్కువగా వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోనే 1,99,332 మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. ప్రతి ఓటరుకు వచ్చే నెల 24 వరకూ ఎన్యుమరేషన్ ఫారాలు అందించేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది.
ఈ మ్యాపింగ్ కాని ఓటర్లు ఎన్నికల కమిషన్ సూచించిన ఆధార్ మినహా 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఆధారంగా చూపించాల్సి ఉంటుంది. దీంతో పాటు తల్లితండ్రులకు సంబంధించిన గుర్తింపును సైతం చూపించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఓటు కోల్పోయే ప్రమాదముంది.
- విధుల్లో 3,318 బీఎల్వోలు
సర్ ప్రక్రియ కోసం బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో) పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. 930 మంది ఓటర్లకు ఒక్కో బీఎల్వోను నియమించారు. ఈ విధంగా జనగామ జిల్లాలో 865 మంది విధుల్లో ఉన్నారు. మహబూబాబాద్‌లో 555 మంది, వరంగల్లో 795, హనుమకొండలో 483, భూపాలపల్లిలో 317, ములుగులో 303 మంది బీఎల్వోలు విధుల్లో ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓటరు జాబితా వివరాలు
మ్యాపింగ్ మ్యాపింగ్ ఓటరు పేర్లలో
నియోజకవర్గం ఓటర్లు అయినవి కానివి శాతం తప్పులు
జనగామ 2,49,437 2,29,971 19,466 92.20 79,102
స్టేషన్ ఘన్పూర్ 2,56,806 2,40,894 15,912 93.80 70,961
పాలకుర్తి 2,61,241 2,46,027 15,214 94.18 86,114
డోర్నకల్ 2,24,165 2,06,914 17,251 92.30 79,784
మహబూబాబాద్ 2,60,770 2,51,704 9,066 96.52 95,537
నర్సంపేట 2,40,244 2,18,555 21,689 90.97 57,747
వరంగల్(తూర్పు) 2,60,437 1,53,232 1,07,205 58.84 48,132
వర్ధన్నపేట 2,76,272 2,21,306 54,966 80.10 67,442
పరకాల 2,22,679 1,93,668 29,011 86.97 47,207
వరంగల్ (పశ్చిమ) 2,86,335 1,94,208 92,127 67.83 83,502
భూపాలపల్లి 2,77,882 2,04,094 73,788 73.45 49,560
ములుగు 2,36,970 1,96,825 40,145 83.06 54,380
మొత్తం 30,53,238 25,57,398 4,95,840 83.76 7,65,088
