న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగ 130వ సవరణ బిల్లుపై నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) స్టడీ టూర్ నిర్వహించింది. బుధవారం ఢిల్లీలోని సెక్రటేరియెట్‌లో కమిటీ భేటీ అయింది. ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలో జరిగిన జేపీసీ సమావేశంలో ఎంపీలు డి.కె. అరుణ, డాక్టర్ కె. లక్ష్మణ్, అనురాగ్ ఠాకూర్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు జేపీసీ సభ్యులకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా... రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు-2025కి సంబంధించిన కీలక అంశాలపై కమిటీ విస్తృతంగా చర్చించింది. ప్రధానంగా ప్రజా జీవితంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా... ప్రజాస్వామ్య సంస్థలు, ప్రభుత్వ పదవుల పట్ల పౌరులకు ఉన్న విశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సమావేశంలో పలు అంశాలను పరిశీలించారు.
బిల్లులో ఏముందంటే..!
ఐదేండ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉన్న క్రిమినల్ నేరాలపై అరెస్టయి, వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉంటే... ప్రధాని, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు తమ పదవులను కోల్పోయేలా గతేడాది కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే, విపక్షాల ఆందోళనలతో బిల్లుపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు పార్లమెంట్ జేపీసీని నియమించింది.ఈ బిల్లు చట్టం రూపంలోకి మారితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(కేంద్ర మంత్రి మండలి), ఆర్టికల్ 164(రాష్ట్ర మంత్రి మండలి), ఆర్టికల్ 239ఏఏ (ఢిల్లీ కి ప్రత్యేక నిబంధనలు) సవరిస్తారు. ఒకవేళ ఏ మంత్రైనా... వరుసగా 30 రోజులు జైల్లో ఉండి పదవికి రాజీనామ చేయకపోతే ప్రధాని, సీఎంల సలహా మేరకు రాష్ట్రపతి, గవర్నర్లు వారిని పదవి నుంచి తొలగించే అధికారం ఈ బిల్లు ద్వారా లభిస్తుంది.
