- జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
- ‘సర్’పై పొలిటికల్ పార్టీలతో మీటింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీసులో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌లో కలెక్టర్ ప్రియాంక ఆల, ఎన్నికల అడిషనల్ కమిషనర్ చంద్రకళ పాల్గొన్నారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులు, అభ్యంతరాల స్వీకరణపై ఆయా పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించారు.
కమిషనర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాను పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించడమే ఎస్‌ఐఆర్ ప్రధాన ఉద్దేశమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తామని, బూత్ లెవెల్ఆఫీసర్ (బీఎల్‌ఓ)కు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కోరారు. నిర్ణీత గడువులోగా భర్తీ చేసిన ఫారాలను సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చబడదన్నారు. అంతకుముందు ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా కార్వాన్ నియోజకవర్గ ఎన్నికల అధికారులు, ఫీల్డ్ సిబ్బందికి మసాబ్‌ట్యాంక్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ట్రైనింగ్ఇవ్వగా, ఇందులో కర్ణన్ పాల్గొని పరిశీలించారు.
