ములుగు/ వెంకటాపూర్, వెలుగు : యువత నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మంత్రి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ ఇప్పటి వరకు ఐటీ రంగం ప్రధానంగా నగరాలకు మాత్రమే పరిమితమైందని, ఐటీ అవకాశాలు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు కూడా చేరుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రియా ఇన్ఫోటెక్ సంస్థ స్థానిక అవసరాలకు అనుగుణంగా యాప్‌లను అభివృద్ధి చేసి వివిధ పాఠశాలలు, సంస్థలు, ఐటీ రంగానికి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థలో సుమారు 15 మంది యువత ఉద్యోగాలు పొందడం అభినందనీయమన్నారు.
ములుగు జిల్లా ఇంచర్ల లో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని జీవంతరావుపల్లిలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సీఆర్ఆర్నిధులు రూ.29.50 లక్షలతో పీఆర్రోడ్డు నుంచి మోడల్ స్కూల్ వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం“ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య - ప్రతి చేతిలో ఉచిత పాఠ్యపుస్తకాలు” అనే లక్ష్యంతో జీవంతరావుపల్లి పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో తదితరులు
పాల్గొన్నారు
