మల్కాజ్‌గిరి, వెలుగు: చర్లపల్లి పారిశ్రామిక వాడలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫేజ్-2లోని ‘మెటల్ ఫోర్జింగ్ ఇండస్ట్రీస్ యూనిట్-2’లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలోని పలు యంత్రాలు, పారిశ్రామిక పరికరాలు కాలిపోయాయి. సుమారు 6 వేల లీటర్ల ఆయిల్ అగ్నికి ఆహుతైంది. ఆయిల్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో గంటకు పైగా ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది.
దీంతో చుట్టుపక్కల పరిశ్రమల కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చర్లపల్లి అగ్నిమాపక కేంద్ర ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు యాజమాన్యం తెలిపింది.
