హ్యామ్ రోడ్ల ఓపెనింగ్ మరింత ఆలస్యం..వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు అధికారుల వెల్లడి

హ్యామ్ రోడ్ల ఓపెనింగ్ మరింత ఆలస్యం..వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు అధికారుల వెల్లడి
  • రూ.13 వేల కోట్ల రోడ్ల పనులకు21 కంపెనీలతో ఆర్ అండ్ బీ ఒప్పందం 
  • నల్గొండ సభకు మంత్రి కోమటిరెడ్డి ఏర్పాట్లు.. కానీ పనుల ఓపెనింగ్​ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోన్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో హ్యామ్​ రోడ్ల ఓపెనింగ్​ మరింత ఆలస్యం కానున్నది. ఈ నెల 17న నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్​ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నల్గొండలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మూడు, నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నారు.

తీరా వర్షాల నేపథ్యంలో ఈ ఓపెనింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో చేపట్టబోయే పనులకు సంబంధించి 21 కాంట్రాక్టు సంస్థలతో ఆర్ అండ్ బీశాఖ ఒప్పందం చేసుకుంది. పనులు ప్రారంభించడానికి అవసరమైన అగ్రిమెంట్లు అన్నీ పూర్తయ్యాయి.

రూ.13,006 కోట్ల వ్యయంతో 441 రోడ్ల అభివృద్ధి..

రాష్ట్రంలో హ్యామ్​ ప్రాజెక్ట్​ ఫేజ్-1 కింద రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ.13,006.27 కోట్ల వ్యయంతో 441 రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మొత్తం 6,092.37 కిలోమీటర్ల పొడవుతో 34 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవగా, అందులో 31 ప్యాకేజీల వర్కులు ఫైనల్ అయ్యాయి. కేవలం 5 శాతం ఎక్సెస్​ పైనే మొత్తం 21 కాంట్రాక్ట్​ సంస్థలతో ఆర్​ అండ్​ బీ శాఖ ఇంజినీర్లు ఒప్పందం చేసుకున్నారు. కాంగ్రెస్​ సర్కార్​హయాంలో ఆర్​అండ్​ బీ శాఖలోనే ఇది అతి పెద్ద ప్రాజెక్ట్​ కావడంతో, పనులు స్టార్ట్​ చేయడాన్ని సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

ఈ నెల 17న సీఎం రేవంత్​ చేతుల మీదుగా ప్రారంభించాలని తొలుత సర్కారు నిర్ణయించింది. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా చేయడానికి ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తన సొంత నియోజకవర్గమైన నల్గొండ పరిధిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు లక్ష మందిని ఈ సభకు తరలించడానికి మూడు, నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉండి చర్చలు జరిపారు.

ఆది నుంచీ అవాంతరాలే..

హ్యామ్​ ప్రాజెక్ట్​ విషయంలో ఆది నుంచి అనేక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. మొదట 60 శాతం బిల్లుల చెల్లింపుపై లోకల్​ కాంట్రాక్టర్లు వ్యతిరేకించారు. పనులు చేసి 15 ఏళ్ల పాటు బిల్లుల కోసం ఆగలేమన్నారు. దీంతో ప్రభుత్వం ఆర్​బీఐ ఆఫీసర్లతో మాట్లాడి, కాళేశ్వరం ప్రాజెక్ట్​ మాదిరిగా ఏ ప్రభుత్వం వచ్చినా బిల్స్​ పేమేంట్​ చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలవగా 5 నుంచి 23 శాతానికి పైగా టెండర్లు ఎక్సెస్​ వేశారని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టాయి. ప్రజాధనాన్ని రేవంత్​ సర్కారు దుర్వినియోగం చేస్తుందని విమర్శలు చేశాయి. దీంతో సీఎం రేవంత్​ జోక్యం చేసుకొని కాంట్రాక్ట్​ సంస్థలతో మాట్లాడి, కేవలం 5 శాతం ఎక్సెస్​కే అన్నీ ఏజేన్సీలు ఒప్పుకునేలా చేశారు. కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేసుకున్నాక ఈ నెల 17న ఓపెనింగ్​ డేట్​ ఫిక్స్​ చేయగా, ఇప్పుడదీ కాస్తా వర్షాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని ఇంజినీర్లు తెలిపారు.