కేరళ మోడల్లో డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పూడికతీత చేపట్టాలి..వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన పద్ధతులపై స్టడీ చేయండి: మంత్రి ఉత్తమ్

కేరళ మోడల్లో డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పూడికతీత చేపట్టాలి..వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన పద్ధతులపై స్టడీ చేయండి: మంత్రి ఉత్తమ్
  • పూడికతీత ఎంత లేట్ అయితే అంత నష్టం తప్పదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో పూడికతీతను కేరళ తరహాలోనే చేపట్టాలని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేరళలోని పాలక్కడ్​ జిల్లాలో ఉన్న మంగళం డ్యామ్​లో విజయవంతంగా పూడిక తీశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. 2017లో ఆ ప్రాజెక్టులో పూడికతీత కార్యక్రమం చేపట్టారని, శాస్త్రీయ పద్ధతుల్లో చేయడం ద్వారా డ్యామ్​లో పూడిక పోవడమే కాకుండా, ఆర్థికంగానూ ప్రయోజనం చేకూరిందని చెప్పారు.

కేరళ లాంటి బెస్ట్ మోడల్స్​పై అధికారులు స్టడీ చేయాలన్నారు. బుధవారం ఆయన సెక్రటేరియెట్​లో ఇరిగేషన్​, మైనింగ్​ శాఖల అధికారులతో ప్రాజెక్టుల్లో పూడికతీత అంశంపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల్లో పూడికతీత ఎంత ఆలస్యమైతే అంత నష్టమని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నిరుడు పంజాబ్​లో వచ్చిన వరదలకు 22 జిల్లాలకుగానూ 16 జిల్లాలు మునిగిపోయాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

దీనివల్ల కేవలం వరద నష్టానికే రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. ముందే పూడికతీత చేపట్టడం, డ్రైనేజీల పునరుద్ధరణ, వాటర్ స్టోరేజీ సామర్థ్యాల పెంపు వంటి నివారణ చర్యలు తీసుకుంటే ఇలాంటి భారీ నష్టాన్ని తప్పించుకోవచ్చన్నారు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని కీలకమైన ప్రాజెక్టుల ఒరిజినల్​ స్టోరేజ్​ను పునరుద్ధరించేలా పూడికతీత కార్యక్రమం చేపట్టాలన్నారు. వరద ముప్పును తగ్గించడానికి, ఇరిగేషన్​ సామర్థ్యాన్ని పెంచడానికి పూడికతీత ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఇతర రాష్ట్రాల పద్ధతులపై స్టడీ చేయాలి

ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన, ప్రస్తుతం చేస్తున్న పూడికతీత పద్ధతులపై పూర్తిగా స్టడీ చేయాలని, అందులోని మంచి నమూనాను మన దగ్గర అమలు చేయాలని మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్​ ఫ్రేమ్​వర్క్​ను కూడా ఒకసారి అధ్యయనం చేయాలన్నారు.

కడెం ప్రాజెక్టులో పూడికతీత విషయంలో కాంట్రాక్ట్​ సంస్థలకు ఎదురవుతున్న సవాళ్లు, లోయర్​ మానేరు, మిడ్​మానేరుల్లో పూడికతీత పురోగతి గురించి ఆయన అధికారులను ఆరా తీశారు. శ్రీరాంసాగర్​, నిజాంసాగర్​ ప్రాజెక్టుల్లో పూడికతీతకు సంబంధించిన అవసరాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.