ఫ్రీ మెడిసిన్​ను అమ్మేస్తున్నరు.. అంబర్‌‌పేటలో భారీ డంప్‌ను పట్టుకున్న డీసీఏ

ఫ్రీ మెడిసిన్​ను అమ్మేస్తున్నరు.. అంబర్‌‌పేటలో భారీ డంప్‌ను పట్టుకున్న డీసీఏ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో పేషెంట్లకు ఉచితంగా ఇవ్వాల్సిన మెడిసిన్‌ను కొంత మంది అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. పేషెంట్లకు ఇచ్చినట్టుగా చూపిస్తూ, వాటిని ప్రైవేటు డ్రగ్‌ ఏజెన్సీలకు, మెడికల్ షాపులకు అమ్ముకుంటున్నారు. డ్రగ్‌ కంట్రోల్ అథారిటీ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లోని అంబర్‌‌పేట్‌లో ఉన్న ఓ గోడౌన్‌పై జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. స్టేట్ మెడికల్ కార్పొరేషన్‌(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) కొనుగోలు చేసి, ప్రభుత్వ హాస్పిటళ్లకు సప్లై చేసిన ట్యాబ్లెట్స్‌ ఈ గోడౌన్‌లో ఉన్నట్టు వారు గుర్తించారు.

ప్రభుత్వ దవాఖాన్లకు మాత్రమే సప్లై చేయాల్సిన మెడిసిన్‌ ఈ గోడౌన్‌లో భారీ మొత్తంలో పట్టుకున్నామని, వాటిని సీజ్ చేశామని డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ కమలాసన్‌ రెడ్డి ప్రకటించారు. మహమ్మద్ బషీర్ అహ్మద్‌ అనే వ్యక్తి ఈ గోడౌన్‌ను నిర్వహిస్తున్నాడని, ఇక్కడ పెద్ద మొత్తంలో మెడిసిన్‌ను స్టాక్ చేసి, ఇక్కడి నుంచి మెడికల్ షాపులకు సప్లయ్ చేస్తున్నాడని ఆయన వెల్లడించారు. మెడిసిన్ స్టోర్ చేసేందుకు, అమ్మేందుకు ఇతనికి పర్మిషన్ లేకపోగా.. నకిలీ, నాసిరకం మందులను ఇతను సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించామని కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. మొత్తం రూ.20.52 లక్షల విలువైన మెడిసిన్‌ను సీజ్ చేసినట్టు ఆయన వెల్లడించారు.

ఇందులో హయ్యర్ జనరేషన్ యాంటిబయాటిక్ ట్యాబ్లెట్స్‌, ఇంజక్షన్స్, పిల్లలకు ఇచ్చే సిరప్‌లు, యాంటి అల్సర్, యాంటిమలేరియా డ్రగ్స్‌ ఉన్నాయని తెలిపారు.  హిమాచల్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ఫార్మా కంపెనీల్లో తయారైనట్టుగా రాసి ఉన్న ఈ మెడిసిన్‌ను ఆష్లే ఫార్మాటెక్ లేబుల్స్‌తో విక్రయిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీఏ అధికారులు సూచించారు. గోడైన్‌పై రెయిడ్ చేసిన వారిలో డీసీఏ జాయింట్ డైరెక్టర్‌‌ జి.రామ్‌దాన్‌, అసిస్టెంట్ డైరెక్టర్లు రాజమౌళి, డి.సరిత, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు  నాగరాజు, రష్మి, లక్ష్మినారాయణ, అజయ్‌, కార్తిక్, శివ చైతన్య తదితరులు ఉన్నారు.

కాప్రాలో ప్రమాదకర పరిస్థితుల్లో ఇన్సూలిన్ ఇంజక్షన్లు స్టోరేజ్

 గ్రేటర్‌ పరిధిలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో  మెడికల్ షాపులు, మెడిసిన్ డిస్ట్రిబ్యూటర్ల నిర్లక్ష్యం బయటడింది. కాప్రా రాజరాజేశ్వర మెడికల్ డిస్టిబ్యూటర్ నిర్వహకుల నిర్లక్ష్యం అధికారుల తనిఖీల్లో తేలింది. ఫ్రిజ్​లో భద్రపరచాల్సిన ఇన్సూలిన్ ఇంజక్షన్లు బయట ర్యాక్ లో నిల్వ చేసినట్లు గుర్తించారు. రూ. 5 లక్షల విలువ చేసే ఇంజక్షన్లను సీజ్ చేశారు. డయాబెటిస్ కంట్రోల్ చేసే ఇన్సూలిన్ ఇంజక్షన్లు సరైన పద్ధతిలో నిల్వ చేసి అమ్మాలని మెడికల్ షాపుల నిర్వాహకులకు రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.