
- సుప్రీం తీర్పుతో 45 వేల మంది టీచర్ల ఉద్యోగాలకు, 60 వేల మంది ప్రమోషన్లకు గండం
- ఇన్ సర్వీస్ టీచర్ల ఆందోళన నేపథ్యంలో సర్కారు సమాలోచన
హైదరాబాద్, వెలుగు: ఇన్ సర్వీస్ టీచర్లకు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్కారు పునరాలోచన చేయాలని భావిస్తున్నది. తీర్పుపై అప్పీల్ కు పోవాలని రెడీ అవుతున్నది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలూ విద్యాశాఖ అధికారులు రెడీ చేస్తున్నారు. ఇది వేలాది మంది టీచర్లకు ఊరట కల్గించనున్నది. రాష్ట్రంలో 26 వేలకు పైగా సర్కారు బడుల్లో 1.11 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఈ నెల 1వ తేదీన టెట్ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పదవీ విరమణకు ఐదేండ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న టీచర్లు తమ సర్వీస్‌ను కొనసాగించాలంటే, ఉత్తర్వుల తేదీ నుంచి రెండేళ్లలోపు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలని పేర్కొన్నది.
టెట్ క్వాలిపై కాకపోతే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఐదేండ్ల కంటే తక్కువ సర్వీస్ ఉన్న టీచర్లకు మినహాయింపు ఉన్నప్పటికీ, వాళ్లు ప్రమోషన్ కోరుకుంటే మాత్రం టెట్ క్వాలిఫై కావాల్సిందే. ఈ ఉత్తర్వులు మైనారిటీయేతర పాఠశాలలకు మాత్రమే వర్తించనున్నాయి. కాగా, టీచర్ల నియామకాలకు టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టులో ఎన్సీటీఈ ఉత్తర్వులిచ్చింది. అప్పటి నుంచి టీచర్ల నియామకాల్లో టెట్ క్వాలిఫై అయినోళ్లకే అవకాశం ఇచ్చారు. అయితే, అప్పట్లో ఎన్సీటీఈ ఉత్తర్వుల్లో అప్పటికే నియామకమైన వారికి టెట్ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. దీంతో ఇప్పటిదాకా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్‌తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు కల్పించారు. ఇప్పుడు సుప్రీం తీర్పు వాళ్లందరిపై ప్రభావం చూపిస్తున్నది.
45 వేల మంది టీచర్లకు గండం
టెట్ తప్పనిసరి కావడంతో రాష్ట్రంలో 45,742 మంది టీచర్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. వీరంతా తప్పనిసరిగా రెండేండ్లలో టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. లేకపోతే, రిటైర్మెంట్ కావాల్సి ఉంది. మరో 60,094 మంది టీచర్లకు ప్రమోషన్లకు ఎలిజిలిటీ కావాలంటే టెట్ క్వాలిఫై కావాలి. వీరంతా కూడా 2012 కంటే ముందే రిక్రూట్ అయిన వారే. అయితే, సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతమున్న టీచర్లలో సగం మందిపై ప్రభావం చూపుతుండటంతో అందరిలో అయోమయం నెలకొన్నది. సుప్రీంకోర్టు తీర్పు ఉద్యోగ భద్రతకే ప్రమాదంగా ఉందని టీచర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఇటీవల టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి నేతృత్వంలో పీఆర్టీయూ నేతలు, బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి నేతృత్వంలో తపస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు. మరోపక్క కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నూ వారితో పాటు పలు టీచర్ల సంఘాల నేతలు కలిసి సమస్యను వివరించారు. దీనికి సీఎంతో పాటు కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించారు. మరోపక్క స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఈనెలాఖరులో రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు.
రివ్యూ పిటిషన్కు రెడీ
టీచర్ల సంఘాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో సర్కారు సానుకూలంగా ఉంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సర్కారుకు ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది. సర్కారు నుంచి అనుమతి రాగానే.. రివ్యూ పిటిషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.