చెరుకు వేయాలా.. వద్దా? ‘ప్రత్యామ్నాయం’ చూపించని సర్కారు

చెరుకు వేయాలా.. వద్దా? ‘ప్రత్యామ్నాయం’ చూపించని సర్కారు
  • చెరుకు వేయాలా.. వద్దా?
  • ‘ప్రత్యామ్నాయం’ చూపించని సర్కారు

సంగారెడ్డి, వెలుగు : వరి వద్దంటున్న సర్కారు రైతులకు ‘ప్రత్యామ్నాయం’ మాత్రం చూపించడం లేదు. ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఏ పంటలు వేయాలో తెలియక రైతులు గందరగోళానికి గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదిలోని గణపతి షుగర్స్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల రైతులు మొన్నటివరకు చెరుకు సాగు చేసేవారు. కార్మికుల కొత్త వేతన సవరణ, ఇతరత్రా సమస్యల కారణంగా ఫ్యాక్టరీ యాజమాన్యం, కార్మికుల మధ్య వివాదం తలెత్తింది. యాజమాన్యం ఉన్నట్టుండి ఫ్యాక్టరీని మూసేసి లాకౌట్ ప్రకటించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గత నెల 28న సడన్ గా మూసేయడంతో అటు కార్మికులు, ఇటు ఫ్యాక్టరీని నమ్ముకున్న చెరుకు రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్కారుకు మాత్రం కార్మికులు, రైతుల సమస్య ఏమాత్రం పట్టడం లేదు. 

రెండున్నర దశాబ్దాలుగా చెరుకు సాగు

సంగారెడ్డి మండలం ఫసల్ వాది, కులబ్ గూర్ గ్రామాల మధ్య గణపతి షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్యాక్టరీని 1996లో వంద ఎకరాల్లో స్థాపించారు. రూ. 60 కోట్ల పెట్టుబడితో రోజుకు 2,500 టన్నుల చెరకు క్రషింగ్ కెపాసిటీతో మొదలైంది. పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 6,500 టన్నుల చెరకు క్రషింగ్ కెపాసిటీతో కొనసాగుతోంది. పర్మనెంట్ కార్మికులు 232 మంది, మరో 208 మంది టెంపరరీ కార్మికులుగా పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 34 వేల ఎకరాల్లో చెరుకు పండిస్తుండగా, ఒక్క గణపతి షుగర్స్ పరిధిలోనే 12 వేల ఎకరాల్లో సాగు చేసేవారు. ఈసారి కొత్తగా మరో 3 వేల ఎకరాల్లో సాగు పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ చెరుకు ఫ్యాక్టరీ లాకౌట్ పంట సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 

స్పందించని యాజమాన్యం

గణపతి షుగర్స్​ ఫ్యాక్టరీ లాకౌట్ ఎత్తేయడంపై యాజమాన్యం స్పందించడం లేదని కార్మికులు, చెరుకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 21 రోజుల్లో కార్మిక శాఖ ఆధ్వర్యంలో మూడు దఫాలుగా చర్చలకు పిలిచినా యాజమాన్యం రాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే జహీరాబాద్ సమీపంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మూసేసిన ఏడాదిన్నర తర్వాత జిల్లా యంత్రాంగం వాటి ఆస్తులు అమ్మకానికి పెట్టగా అప్పుడు యాజమాన్యం స్పందించి ఫ్యాక్టరీని తెరిచి క్రషింగ్ స్టార్ట్ చేయించింది. ఈ ఘటన మరువకముందే ఇప్పుడు గణపతి షుగర్స్ ఫ్యాక్టరీ కూడా అక్రమ లాకౌట్ ప్రకటించడం అయోమయానికి గురి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా రికవరీ వచ్చిన షుగర్ ఫ్యాక్టరీలలో  గణపతి షుగర్స్​ఒకటి. ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యం వద్ద 4 లక్షల టన్నుల చక్కెర నిల్వలు ఉన్నట్టు చెరుకు అభివృద్ధి మండలి అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో చక్కెర ధరలు పెరగడం కూడా యాజమాన్యానికి బాగా కలిసొచ్చినట్టు రైతులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాక్టరీని నమ్ముకున్న చెరుకు రైతుల పట్ల యాజమాన్యం సానుకూలంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. వెంటనే ఫ్యాక్టరీ తెరిపించి చెరుకు రైతులతో అగ్రిమెంట్ చేసుకోవాలని, ఈ దిశగా సర్కారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ఆందోళన వద్దు


గణపతి చెరుకు ఫ్యాక్టరీ లాకౌట్ విషయమై ఎవరూ ఆందోళన చెందవద్దు. కొత్త వేతన సవరణపై తలెత్తిన వివాదం కారణంగా యాజమాన్యం లాకౌట్ నిర్ణయం తీసుకుంది. అంతే తప్ప ఫ్యాక్టరీ శాశ్వతంగా మూసేస్తారన్న అపనమ్మకంతో ఉండవద్దు. లాకౌట్ నిర్ణయంతో రైతుల్లో కొంత అయోమయ పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవమే. కానీ అది శాశ్వతం కాదు..త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.


– రాజ్ కుమార్, కేన్ అసిస్టెంట్ కమిషనర్