
వనపర్తి, వెలుగు: పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వనపర్తి జిల్లాలో 5.50 లక్షల జనాభా ఉండగా, 93 వేల లీటర్లు మాత్రమే పాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ క్రమంలో గేదెల సంఖ్యను పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా సెక్స్ సాటెడ్ సెమన్(లింగ నిర్ధారణ వీర్యం) ద్వారా కృత్రిమ గర్భధారణతో గేదెల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నారు.
ట్రయల్ రన్ కింద లింగ నిర్ధారణ..
రైతులు గేదెలు కావాలని కోరుకుంటారు. తద్వారా పాల ఉత్పత్తి పెరిగి వ్యవసాయానికి తోడు పాల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని భావిస్తారు. కానీ, సరైన ప్రోత్సాహం లేక గేదెల పోషణపై అవగాహన పెంచేందుకు సెక్స్ సాటెడ్ సెమెన్(లింగ నిర్ధారణ వీర్యం) కార్యక్రమాన్ని ట్రయల్ రన్‌గా చేపట్టారు. ఈ పద్ధతి ద్వారా మేల్ క్రోమోజోములను వేరు చేసి ఫిమేల్ క్రోమోజోములను సేకరించి మేలు జాతి గేదెలకు ఇస్తారు. ఈ పథకం కింద 90 శాతం సక్సెస్ సాధించారు. ఇలా ఒక్కో గేదెకు ఎస్ఎస్ఎస్ చేయడానికి రూ.250 నామినల్ ఫీజు తీసుకుంటారు.
గోపాలమిత్రల టార్గెట్ కంప్లీట్..
ఎస్ఎస్ఎస్ కార్యక్రమం కింద టార్గెట్‌ను కంప్లీట్ చేసేందుకు పశు వైద్యశాలలు, గోపాలమిత్రలకు కలిపి 1,100 శాంపిళ్లు ఇచ్చారు. ఇందులో పశువైద్యశాలల్లో 375కు గాను 284 శాంపిళ్లను పూర్తి చేశారు. గోపాలమిత్రలు తమకు ఇచ్చిన 725 టార్గెట్‌ను పూర్తి చేశారు. ఈ ట్రయల్ రన్ సక్సెస్‌ను బట్టి గేదెలకు రెగ్యులర్‌గా ఎస్ఎస్ఎస్ విధానంలో కృత్రిమ గర్భధారణ చేస్తారు. ప్రతి 21రోజుల కోసారి ఎదకొచ్చే గేదెలకు మొదటిసారి నామినల్ ఫీజు తీసుకుంటుండగా, రెండోసారి ఫ్రీగా ఇవ్వనున్నారు. ఇలా గేదెల సంఖ్యతో పాటు పాల ఉత్పత్తి పెరుగుతుందని భావిస్తున్నారు.
రైతుల్లో అవగాహన పెంచుతాం..
ఎస్ఎస్ఎస్ పథకంలో 90 శాతం సక్సెస్ సాధించాం. ఇంకా రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. పాల ఉత్పత్తి పెంచుకోవడంలో భాగంగా ట్రయల్ రన్ కింద చేపట్టిన ప్రోగ్రాం జిల్లాలో సక్సెస్ అయింది. ఇక నుంచి రెగ్యులర్‌గా ఈ కార్యక్రమాన్ని చేపడతాం. - వెంకటేశ్వరరెడ్డి, జిల్లా పశు సంవర్ధకశాఖాధికారి, వనపర్తి