- పూర్తిగా నష్టం జరిగిన ఇండ్లకు రూ.1.30 లక్షలు, పాక్షికికంగా దెబ్బతింటే రూ.6,500
- నీట మునిగిన ఇండ్లకు రూ.15 వేల పరిహారం ఇచ్చేలా సర్కారు చర్యలు
- గ్రేటర్ వరంగల్ లో కాలనీల వారీగా సర్వే షురూ
- ఆర్ఐలు, వార్డు ఆఫీసర్లతో ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాల ఏర్పాటు
- ఇంటింటికీ తిరిగి సమాచారం తీసుకుంటున్న సిబ్బంది
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో వరద బాధితులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పూర్తిగా నష్టం జరిగిన ఇండ్లతోపాటు పాక్షికికంగా దెబ్బతిన్న, నీట మునిగిన ఇండ్లకు పరిహారం ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. ఆఫీసర్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లు, కాలనీల వారీగా వరద బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. సర్వే అనంతరం ప్రభుత్వ సాయాన్ని ఇంటి యజమాని అకౌంట్లలో జమ చేయనున్నారు.
వరదలతో ఇండ్లన్నీ ఆగమాగం..
మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని ఇండ్లన్నీ అల్లకల్లోలమయ్యాయి. హనుమకొండలో వంద ఫీట్ల రోడ్డు వెంట ఉన్న అమరావతినగర్, వివేక్ నగర్, ప్రగతినగర్, సమ్మయ్య నగర్, టీవీ టవర్ కాలనీ, శ్రీకృష్ణ కాలనీ, గాంధీనగర్, రాజాజీ నగర్, నయీంనగర్, పోచమ్మకుంట, బొక్కలగడ్డ, హంటర్ రోడ్డు తదితర కాలనీలు నీటమునిగాయి. వరంగల్ వైపు మైసయ్యనగర్, శివనగర్, పెరుకవాడ, రామన్నపేట, పోతన నగర్, రంగంపేట, భద్రకాళి టెంపుల్ లైన్, సంతోషిమాత కాలనీ, ఎన్టీఆర్ నగర్, సాయిగణేశ్ కాలనీ, వివేకానంద కాలనీ, ఎస్ఆర్ నగర్ ఆ చుట్టుపక్కల కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాశీబుగ్గ, కాజీపేట మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని 78 కాలనీలు నీళ్లలో మునిగిపోగా, దాదాపు 1560 మంది పునరావాస కేంద్రాల బాట పట్టాల్సి వచ్చింది. 30 వేలకు పైగా ఇండ్లు వరదల్లో చిక్కుకోగా, గ్రౌండ్ ఫ్లోర్లలోని ఇండ్లన్నీ నీట మునిగి సామగ్రి తడిసిపోయింది.
పూర్తిగా నష్టం జరిగితే రూ.1.30 లక్షలు
అకస్మాత్తు వరదలతో వరంగల్ నగరంలో రోడ్లు, కరెంట్ పోల్స్, ఇండ్లు పెద్ద ఎత్తున దెబ్బతినగా సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు శుక్రవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరంగల్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి వరంగల్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, బాధితులతో మాట్లాడారు.
ఇక్కడి పరిస్థితులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి వరదల్లో ఇండ్లు మునిగిన బాధితులకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు పూర్తిగా నష్టం జరిగిన ఇండ్లకు రూ.1.30 లక్షలు, పాక్షికికంగా దెబ్బతింటే రూ.6,500, నీట మునిగిన ఇండ్లకు రూ.15 వేలు, దెబ్బతిన్న గుడిసెలకు రూ.8 వేలు పరిహారం ఇచ్చేలా అధికారులు చర్యలు చేపడుతోంది.
ఇంటింటి సర్వే షురూ..
సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు వరద బాధితులకు ఆర్థికసాయం అందించేందుకు హనుమకొండ, వరంగల్, జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. శనివారం వరంగల్ నగరంలో ప్రత్యేక బృందాలతో ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. ప్రతి కాలనీకి ఇద్దరు ఆర్ఐలు, ఇద్దరు వార్డు ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని కేటాయించగా, నగర వ్యాప్తంగా దాదాపు 250 మంది కాలనీల వారీగా క్షేత్రస్థాయి సర్వే స్టార్ట్ చేశారు.
ఇంటింటికీ తిరుగుతూ నష్టం జరిగిన వివరాలు సేకరిస్తున్నారు. నష్టం వివరాలతోపాటు కుటుంబ యజమాని, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సీ తదితర వివరాలను ప్రత్యేక ప్రొఫార్మ ప్రకారం నమోదు చేస్తున్నారు. వారం రోజుల్లోగా సర్వే పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, ఆ తర్వాత సర్కారు నుంచి సాయం నేరుగా బాధితుల అకౌంట్ లో జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
సర్వేను త్వరగా పూర్తి చేయాలి..
వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టంపై తొందరగా సర్వే పూర్తి చేసి నివేదికను అందించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ సమ్మయ్యనగర్ పరిధిలోని కాలనీల్లో చేపట్టిన సర్వేను శనివారం ఆమె పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సర్వే తీరును పరిశీలించి ఆఫీసర్లు, బాధితులతో మాట్లాడారు.
అనంతరం కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఇంటికి వెళ్లి నష్టం వివరాలను సేకరించాలన్నారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే రిపేర్లు చేసి, రాకపోకలను పునరుద్ధరించాలని ఆర్అండ్ బీ ఆఫీసర్లకు సూచించారు. కలెక్టర్ వెంట జీడబ్ల్యూఎంసీ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, సీఎంహెచ్వో రాజారెడ్డి తదితరులున్నారు.
