ఇంజనీరింగ్​ విద్యను పేదోడికి దూరం చేసే కుట్ర!

ఇంజనీరింగ్​ విద్యను పేదోడికి దూరం చేసే కుట్ర!

రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు భారీగా పెరిగాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అమాయకత్వమే ఆసరాగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు దోపిడీకి తెరలేపాయి. ఫీజులు పెంచుకోవడానికి ఏకంగా హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవడం, లక్షల్లో ఫీజులు నిర్ధారించడం ఆందోళన కలిగిస్తున్నది. 40 ఇంజనీరింగ్​కాలేజీల్లో ఏడాది ఫీజు రూ.లక్ష పైనే చెల్లించాల్సి వస్తే ఇంజనీరింగ్​విద్యలో చేరే పేద విద్యార్థులు ఎందరుంటారు?  ఫీజులను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను గాలికొదలగా, సర్కారు వర్సిటీలు కూడా ప్రైవేటు కాలేజీలకు ఏమాత్రం తీసిపోకుండా ఫీజులు పెంచుతున్నాయి. ఇదంతా పేదోడికి ఇంజనీరింగ్​విద్యను దూరం చేసే కుట్రలో భాగమే!  ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో కనీస ఫీజు రూ.35 వేలు ఉంటే, వర్సిటీ క్యాంపస్, సర్కారు కాలేజీల్లో మాత్రం రూ.50 వేలకు పెంచేశారు. గడిచిన రెండేండ్లలో సర్కారు కాలేజీల్లోనే మూడింతల ఫీజు పెరగడం దేనికి సంకేతం?  సెల్ఫ్​ఫైనాన్స్​లోనూ ప్రైవేటు కాలేజీలకు పోటీగా సర్కారు వర్సిటీలు, కాలేజీలు రూ.లక్ష ఫీజును నిర్ణయించాయి. జేఎన్టీయూ, ఓయూ వరుసగా రెండేండ్లు బీటెక్ ఫీజులు పెంచడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులపై తీవ్ర భారం పడనుంది. ప్రైవేటు కాలేజీల్లో ఇంజనీరింగ్​ ఫీజులను కంట్రోల్​చేయాల్సిన ప్రభుత్వం, ఆ పని చేయకపోగా, సర్కారు యూనివర్సిటీలు ఫీజులు పెంచడం ఎంత వరకు న్యాయం?.

అడ్డగోలు సీట్ల అమ్మకం

ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియ ఇంకా మొదలుకాక ముందే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు లక్షలాది రూపాయలకు సీట్లు అమ్ముకుంటూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం 1,11,147 ఇంజనీరింగ్ సీట్లకు ఇప్పటికే ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే కొనసాగుతున్న సీట్లతోపాటు ఈసారి కొత్తగా సీఎస్ఈ సంబంధిత కోర్సుల(7,815 సీట్ల)కు ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది. సంబంధిత యూనివర్సిటీలు జేఎన్​టీయూ, ఓయూ ఆయా కాలేజీల్లో సౌలత్​లు, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, లేబరేటరీలు నిబంధనల ప్రకారం ఉన్నాయా? లేవా? అని తనిఖీలు నిర్వహించి గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు అలాంటి చర్యలేమీ తీసుకోవడం లేదు. దీంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా.. ఒక్కో సీటును లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాయి

ఫీజులు రెగ్యులేటరీ కమిటీ ఉన్నా..

సాధారణంగా ప్రతి మూడేండ్లకోసారి ఇంజనీరింగ్ ఫీజులను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ సవరిస్తుంది. కరోనా కారణంగా ఈసారి  ఫీజులను పెంచేది లేదని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా, దాన్ని సహించని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లి ఫీజులు పెంచుకోవడానికి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నాయి. కానీ, తుది నిర్ణయం తీసుకునే వరకు కట్టిన ఫీజులను కాలేజీ అకౌంట్స్ లోనే ఉంచాలని హైకోర్టు నిర్ణయించింది. అంటే ప్రభుత్వం ఫీజులను నిర్ణయించే దాకా కూడా ప్రైవేటు కాలేజీలు ఓపిక పట్టడం లేదు. ఇంకోవైపు ‘బి’ కేటగిరీ సీట్లను ఇష్టానుసారం అమ్ముకుంటున్నాయి. ఇవి కూడా మెరిట్ ప్రకారమే భర్తీ చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక పథకం ప్రకారం కన్వీనర్ కోటా సీట్లను ‘బి’ కేటగిరీ సీట్లుగా మార్చి డబ్బులు పొందడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. సదుపాయాలు, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, లేబరేటరీల మీద దృష్టి పెట్టాల్సిన కాలేజీ యాజమాన్యాలు సిండికేట్ గా ఏర్పడి ఫీజులు పెంచుకునే కుట్ర చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలపై తక్షణమే తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలి. 

రీయింబర్స్​మెంట్ ఏది?

విచ్చలవిడిగా ఫీజులు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం, దానికి తగినట్టుగా పూర్తి ఫీజు రీయింబర్స్​మెంట్ మాత్రం ఇవ్వడం లేదు. పెంచిన ఫీజుల భారాన్ని విద్యార్థులపై మోపడం ద్వారా వేలాది మంది పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. 
- పి. మహేశ్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్​యూ