
- ప్లాన్ రెడీ చేయాలని అధికారులకు మార్గదర్శకాలు
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణ లక్ష్యంగా ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. 2026–-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనుల ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన సోమవారం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. కూలీల బడ్జెట్, పని దినాలను స్పష్టంగా రూపొందించాలని ఆమె పేర్కొన్నారు. అన్ని మండలాల్లో 'యుక్తధార జీఐఎస్' సాంకేతికతను ఉపయోగించి ప్రణాళికలు తయారు చేయాలి. సహజ వనరుల పరిరక్షణ పనులతోపాటు గ్రామీణ ప్రాంతాల జీవన స్థితిగతులను మెరుగుపరిచే పనులకు ఈ ప్రణాళికలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
65 శాతం మిషన్ వాటర్ కన్జర్వేషన్ పనులు, 60 శాతం వ్యవసాయ పనులకు కేటాయించాలని ఆదేశించారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉపాధి పనులు చేపడుతున్నారు. గతంలో ఉపాధి పనుల్లో చోటుచేసుకున్న అక్రమాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పాత విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఉపాధి పనులపై సామాజిక తనిఖీలతో కేంద్రం పూర్తి నిఘా పెంచింది. ఇప్పటికే నేషనల్ ఇన్ఫర్మెటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సర్వర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉపాధి కూలీలకు వారి ఖాతాల్లోనే నేరుగా కూలీ డబ్బులను జమ చేస్తోంది.