- ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్లో ఉండాల్సింది 388 ఎకరాల జాగా
- సర్వేలో లెక్కతేలింది 343 ఎకరాలే!
- లెక్క తేల్చాలన్న సీఎం రేవంత్‌రెడ్డి
- ఎర్రవల్లి, వెంకటాపురంలో సర్వేకు నోటిఫికేషన్
- కేసీఆర్, ఆయన కుటుంబ
- సభ్యులకు నోటీసుల జారీకి ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలను రెవెన్యూశాఖ సేకరించింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల సరిహద్దులోని సర్వే నంబర్ 325లో అధికారిక లెక్కల ప్రకారం 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలి. కానీ ఇటీవల రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో మిగిలిన 45 ఎకరాల భూమి కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా ఆ భూమి ఎక్కడుందో నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
లెక్క తేలాల్సిన భూమిపై సీఎం ఆరా
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల మధ్య రెవెన్యూశాఖ ఇటీవల నిర్వహించిన సర్వే నేపథ్యంలో ఎంసీహెచ్‌ఆర్డీలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో తేలిన భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో అధికారిక లెక్కల ప్రకారం 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాల్సి ఉండగా, ఇటీవలి సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలిందని ఆయనకు వివరించారు. మిగిలిన 45 ఎకరాల భూమి రికార్డుల్లో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కనిపించకపోవడంపై సీఎం ఆరా తీశారు. ఆ భూమి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కలిసిపోయిందనే అనుమానాలను అధికారులు వ్యక్తంచేశారు. దీంతో ఆ భూమి ఎక్కడుందో నిగ్గు తేల్చాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
సీఎం ఆదేశాల నేపథ్యంలో ఎర్రవల్లితో పాటు దాని శివారు గ్రామమైన వెంకటాపురంలో సమగ్ర సరిహద్దు సర్వే కోసం అధికారులు మంగళవారం రాత్రే నోటిఫికేషన్ జారీ చేశారు. సర్వే నంబర్ 325 భూములకు ఆనుకుని ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు నేడో, రేపో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. తమ పరిధిలోని భూములకు సంబంధించిన యాజమాన్య హక్కుల పత్రాలు, పాత రెవెన్యూ రికార్డులను సమర్పించాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేయనున్నారు.
