ఇంకుడు గుంతలు.. కాగితాల పైనే..టార్గెట్ 5 లక్షలు.. ఇప్పటివరకు ఒక్కటీ మొదలుకాలే

ఇంకుడు గుంతలు.. కాగితాల పైనే..టార్గెట్ 5 లక్షలు.. ఇప్పటివరకు ఒక్కటీ మొదలుకాలే



 

 

 

  • 12,760 పంచాయతీల్లో ఈ నెల 20లోపు ..
  • ఇంకుడు గుంతలు నిర్మించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు
  • కరువు పరిస్థితులు ఏర్పడినా కండ్లు తెరవని అధికారులు 
  • వాటర్ హార్వెస్టింగ్​దీ అదే తీరు.. 6,855 పనులకు 229 మాత్రమే పూర్తి
  • వీడియో కాన్ఫరెన్స్ లతోనే కాలక్షేపం.. ఆచరణలో శూన్యం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల పెంపు, నీటి నిల్వ, పరిరక్షణే ధ్యేయంగా 'వీబీ-జీ రామ్​జీ' స్కీమ్​ కింద ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంకుడు గుంతల (సోక్ పిట్) నిర్మాణం కాగితాలకే పరిమితం అవుతోంది. ఆఫీసర్ల నిర్లక్ష్యం, ప్రజల్లో అవగాహన లోపించడంతో సర్కార్ లక్ష్యం క్రమంగా నీరుగారిపోతోంది. ఎల్​నినో కారణంగా ఈ ఏడాది కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉన్నతాధికారుల తీరు మారడం లేదు. 

నిత్యం వీడియో కాన్ఫరెన్స్‌‌లతోనే కాలం వెళ్లదీస్తుండడంతో తమకు గ్రౌండ్ లెవల్‌‌లో పనులు పరిశీలించే టైం దొరకడం లేదని క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీల్లో ఐదు లక్షల వ్యక్తిగత ఇంకుడు గుంతలను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ జారీ చేసింది.

 గడువు ముంచుకొస్తున్నా.. పనుల్లో వేగం పెరగకపోవడంతో టార్గెట్ పూర్తవుతుందా లేదా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ లక్ష్యం కోసం ఆగమాగం పనులు చేసినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

లక్ష్యం ఐదు లక్షలు.. పనులు మాత్రం సున్నా...

రాష్ట్రంలో ఐదు లక్షల మ్యాజిక్ ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఎస్టిమేట్లు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు కూడా సిద్ధం కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు ఒక్క ఇంకుడు గుంత పని కూడా ప్రారంభం కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. 

కాగా, ఇంకుడు గుంత యూనిట్ అంచనా వ్యయం రూ. 6,500. ఇందులో ఉపాధి హామీ పథకం కింద వేతనం రూ. 800 కాగా, మెటీరియల్ కోసం రూ. 5,700 చెల్లిస్తారు. బోర్ వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ యూనిట్ అంచనా వ్యయం రూ. 36 వేలు కాగా... వేతనం కింద రూ.2,900, మెటీరియల్ కోసం రూ. 33,100 కేటాయించారు.

వాటర్ హార్వెస్టింగ్‌‌లోనూ అదే తీరు..

బోర్ వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్, రూఫ్‌‌ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనుల పురోగతి మరింత దయనీయంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,855 రూఫ్‌‌ టాప్ పనులను నిర్దేశించగా.. ఇప్పటివరకు కేవలం 229 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 6,626 పనులు పెండింగ్‌‌లోనే ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 87 పనులు పూర్తి కాగా... యాదాద్రి భువనగిరిలో 23, ఆదిలాబాద్ లో 16, సూర్యాపేటలో 11, రంగారెడ్డిలో 8, సంగారెడ్డిలో 6, వనపర్తి, జగిత్యాలలో 6 చొప్పున, వరంగల్, కామారెడ్డి, పెద్దపల్లిలో 3 చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఒకటి చొప్పున పనులు పూర్తయ్యాయి. 

మెదక్, మహబూబ్‌‌నగర్, నల్గొండ, ఖమ్మం వంటి ప్రధాన జిల్లాల్లో కనీసం ఒక్క పని కూడా పూర్తి కాలేదు. కాగా, ఈ పనులను సకాలంలో పూర్తి చేయించే బాధ్యతను సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారులకు అప్పగించారు. 

అలాగే రోజువారీ ప్రగతిని కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో పనులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని పనులకు విధిగా జియో ట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. గడువు ముగియడానికి కొన్ని రోజులే ఉన్నందున ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించాలని కోరుతున్నారు. 

ఇంకుడు గుంతలతోనే భూగర్భ జలాలు పెరుగుతయ్​

వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు దోహదపడతాయని, కరువు కాలంలోనూ బావులు, బోర్లలో నీటిమట్టం పెరగడానికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 300 నుంచి 500 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా చుక్క నీరు కనిపించని పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ప్రభుత్వం పేర్కొంటుంది. భవిష్యత్ తరాల కోసం ప్రతిఒక్కరూ నీటిని పొదుపుగా వాడుతూ, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం.