జ్ఞానేశ్ రిజైన్ చేయాల్సిందే ..పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ ఎంపీల నిరసన 

జ్ఞానేశ్ రిజైన్ చేయాల్సిందే ..పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ ఎంపీల నిరసన 

 

  • ‘ఆర్ఎస్ఎస్’ గెటప్‌‌లో సీఈసీ దిష్టిబొమ్మతో ఆందోళన
  • ఓటు చోరీతోనే బీజేపీ అధికారంలోకి: ఎంపీ వంశీకృష్ణ
  • పార్లమెంట్‌‌లో ‘సర్’పై చర్చకు ఎందుకు భయం?: ఎంపీ చామల
  • ఓట్‌‌ చోరీతో రాజ్యాంగంపై దాడి: ఎంపీ మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. మంగళవారం పార్లమెంట్ మకర ద్వారం నుంచి ఎలక్షన్‌‌ కమిషన్‌‌ ప్రధాన కార్యాలయం (నిర్వాచన్ సదన్) వరకు సాగిన ప్రతిపక్షాల ఆందోళనలో ముందుండి నడిచారు.

ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్‌‌కుమార్‌‌‌‌రెడ్డి, రఘువీర్ రెడ్డి, రఘురాం రెడ్డి, బలరాం నాయక్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఆవరణలో సాగిన ఆందోళనలో ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్(ఖాకీ నిక్కర్, షర్ట్, తలపై టోపీ)తో కూడిన జ్ఞానేశ్ కుమార్ దిష్టి బొమ్మతో ఆందోళన చేపట్టారు.

‘సేవ్ డెమొక్రసీ’ పేరిట భారీ బ్యానర్‌‌‌‌ను పట్టుకొని.. కేంద్ర ప్రభుత్వానికి, సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మకర ద్వారం నుంచి నిర్వాచన్ సదన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆకాశవాణి భవనం దగ్గర పోలీసులు అడ్డగించడంతో.. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతోపాటు రోడ్డుపై బైటాయించారు. చివరకు పోలీసులు ఎంపీలను అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలిం చారు.  పోలీసుల వాహనాలను కార్యకర్తలు అడ్డుకోవ డంతో అకాశవాణి భవన్ వద్ద దిగిన రాహుల్, ప్రియాంక, ఇతర ఎంపీలు ఆందోళనలో పాల్గొన్నారు. 

సీఈసీని అరెస్ట్‌‌ చేసి విచారించాలి: చామల

‘సర్’ ప్రక్రియతో ఓట్‌‌ చోరీకి పాల్పడిన సీఈసీని అరెస్టు చేసి విచారణ జరపాలని ఎంపీ చామల కిరణ్ కుమార్‌‌‌‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలా జ్ఞానేశ్ కుమార్ వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘సర్’ ప్రక్రియ పేరిట దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ నిర్వీర్యం చేసిందని, అందుకే 50 ఏండ్లు తామే అధికారంలో ఉంటామని మోదీ చెబుతున్నారన్నారు.   

బీజేపీ అంతానికి ఇది ఆరంభం: ఎంపీ మల్లు రవి

ఓట్ చోరీపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి చేపట్టిన ఈ ర్యాలీ.. బీజేపీ అంతానికి ఆరంభమని ఎంపీ మల్లు రవి అన్నారు. ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఓటును తొలగించి.. దేశ పునాదులను కూల్చే ప్రయత్నం 
చేస్తున్నారని మండిపడ్డారు.  ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పై జరుగుతోన్న దాడి అని ఎంపీ ఫైర్ అయ్యారు.  

దేశంలో నిరంకుశ, నియంతృత్వ పాలన: ఎంపీ వంశీకృష్ణ

దేశంలో ఎన్నికల వ్యవస్థ, ఓటర్ల హక్కుల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వ తీరును పెద్దపల్లి ఎంపీ  వంశీకృష్ణ ఎండగట్టారు. ఢిల్లీలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు బీజేపీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిదర్శనమని అన్నారు.‘‘ఓట్లు గెలవలేక.. చీటింగ్ చేసి పరీక్షలో పాస్ అయినట్టుగా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు నిజమైతే.. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య సంక్షోభంగా మారుతుంది.

13 కోట్ల మంది ఓటర్ల హక్కులను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఓటు హక్కును ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరిగితే అది ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు. ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తమ రాజ్యాంగబద్ధమైన బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరించకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతున్నది” అని పేర్కొన్నారు.

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ప్రతిపక్షాల ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపించాలని  వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ‘‘ఓటర్ల హక్కులను పూర్తిగా పరిరక్షించాలి. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగేలా పారదర్శకత పాటించాలి. ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి. ఓటు హక్కుకు సంబంధించిన ఆరోపణలపై ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు.